Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగిత్యాల జిల్లాలో ఘటన
- హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో దాడి యత్నం
నవతెలంగాణ - జగిత్యాల/ధూల్‌పేట్/సిటీబ్యూరో
సైదాబాద్ చిన్నారి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. మరోవైపు అలాంటి ఘటనలు రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో చిన్నారిపై దుండగుడు లైంగికదాడి చేశాడు. అదేవిధంగా హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో బాలికపై లైంగికదాడికి యత్నించగా.. స్థానికులు దుండగున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆరేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను గురువారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ సింధూ శర్మ వెల్లడించారు. ధర్మపురి మండలం తుమ్మనాల గ్రామానికి చెందిన ఆరేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు బుధవారం లైంగికదాడి చేశాడు. కాగా, బాలిక తల్లి గురువారం ఉదయం ఫిర్యాదు చేయగా ధర్మపురి సీఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్ నర్సింగరావు, సతీష్ నిందితుడిని గురువారం సాయంత్రం 5:30గంటలకు ధర్మపురి మండలం నేరేళ్ల గ్రామ సమీపంలోని సాంబశివుని గుట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కరీంనగర్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మహిళా ఎస్ఐ నవత ఆధ్వర్యంలో బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్నారు. చిన్నారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పంపించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మంగళహాట్‌లో బాలికపై లైంగికదాడికి యత్నం
బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకున్ని హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోషామాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మాంగారు బస్తీలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ బాలికను సుమిత్ అనే యువకుడు ఖాళీగావున్న దుకాణం షెటర్‌లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక అరవడంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని రక్షించారు. సుమిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు హబీబ్‌నగర్ పరిధిలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.