Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
- హెచ్‌యూజే సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చేపడుతున్న డిమాండ్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. పెద్దఎత్తున హాజరై కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్‌యూజే అధ్యక్షులు ఈ. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతున్నదన్నారు. 11 ఏండ్లుగా ఇండ్ల స్థలాల సమస్య పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక రకరకాల సమస్యలతో వందలాది మంది జర్నలిస్టులు చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో వంద మంది వరకు చనిపోయినా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌యూజే సభ్యత్వ నమోదు
టీడబ్య్లూజేఎఫ్ అనుబంధ సంఘమైన హెచ్‌యూజే సభ్యత్వ నమోదు సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఈ. చంద్రశేఖర్, కె.నిరంజన్ సంఘం కార్యకలాపాల నివేదికను సమర్పించారు. అనంతరం జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, బి.బసవపున్నయ్యకు సభ్యత్వాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాంచందర్, హెచ్‌యూజే ఉపాధ్యక్షులు బీవీఎన్ పద్మరాజు, నాయకులు గండ్రనవీన్, బయ్య దామోదర్, అచ్చిన ప్రశాంత్, పాండు, విజయానంద్, నాగవాణి, రమేశ్, రాజేందర్, రాము, శివశంకర్, నర్సింహా, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.