Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు వేయాలని డిమాండ్
నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్
తండాకు వెళ్లాలంటే రోడ్డు లేక నరకయాతన పడుతున్నామనీ, వెంటనే తమ తండాకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ను అడ్డుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనవాణిపల్లి గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కుందనవాణిపల్లి గ్రామ శివారుకు ఎమ్మెల్యే కాన్వారు రాగానే.. మబ్బుకుంట, మైసమ్మ వాగు తండాలకు చెందిన గిరిజనులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తండాలకు రోడ్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతున్నామనీ, తమ తండాలకు వచ్చి పరిస్థితి చూడాలనీ, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో కాన్వారు నుంచి దిగిన ఎమ్మెల్యే గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలక్షన్లు ఉన్నప్పుడే తండాలకు వస్తున్నారనీ, తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. స్థానిక నాయకులు గిరిజనులైనప్పటికీ.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయా తాండాలకు రోడ్లు వేసి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో.. వారు ఆందోళన విరమించారు.