Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారుతున్న ఐటీ సంస్థల తీరు..
హైదరాబాద్ : కరోనా మహమ్మారితో ఐటీసంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కలిగించాయి. ఏడాదిన్నరగా ఇదేవిధానాన్ని కొనసాగిస్తున్నసంస్థలు త్వరలో ఆ ఆప్షన్‌కు స్వస్తి పలకనున్నాయి. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులు అతి త్వరలో కార్యాలయాల బాట పట్టనున్నారు. కరోనా తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలావరకు పూర్తికావడంతో పలు ఐటి కంపెనీలు ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు రప్పించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈమేరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్‌ఫ్రం హోంను కల్పించిన ఐటీ కంపెనీలు మొదటిదశ తీవ్రత తగ్గిన అనంతరం వివిధ విభాగాలకు చెందిన వారిని కార్యాలయాల్లో ప్రత్యక్ష విధులకు అనుమతించాయి. కానీ ఇంజనీర్లకు మినహాయింపునిచ్చాయి. ఐటీ కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే వాటిపై ఆధారపడ్డ ఇతర రంగాలు సైతం పురోగతిలోకి వస్తాయంటూ తాజాగా ప్రభుత్వం 'వర్క్ ఎట్ ఆఫీస్' విధానాన్ని అమలు చేసుకోవచ్చని ఆదేశించింది. దీంతో ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీల నుంచి చిన్నపాటి సంస్థలు రాష్ట్రంలో సుమారు 1,500 ఉన్నాయి. వీటిలో 6.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన 4.5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరైతే... అనుబంధంగా ఉన్న రవాణా రంగం, రిటైల్ మార్కెట్, బేకరీ, హోటల్స్‌తో పాటు అద్దె ఇళ్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని.. వారికి కూడా ఉపాధి లభిస్తుందని సమాచారం. ఐటీ ఉద్యోగులకు ప్రాధాన్యతాక్రమంలో వ్యాక్సిన్ అందించామనీ, ఇప్పటికీ వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామనీ, మెజార్టీ ఉద్యోగులు రెండు డోసులు తీసుకున్నారని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు కార్యాలయానికి హాజరుకావచ్చని ఐటీ సంస్థలతో పాటు ఉద్యోగులు భావిస్తున్నారు.
డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో...
ఉద్యోగులను తిరిగి ప్రత్యక్ష విధులకు రప్పించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వ్యూహాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. వచ్చే నెల రెండో వారం నుండి వర్క్ ఎట్ ఆఫీస్ ప్రక్రియను విడతల వారీగా అమలు చేయనున్నాయి. టీం లీడర్, ఆపైస్థాయి ఉద్యోగులను ముందుగా రప్పించి తర్వాత కేటగిరీల వారీగా సిబ్బందిని కార్యాలయాలకు రప్పించనున్నాయి.ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఈ-మెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి.
దసరా తర్వాత నుంచి ప్రత్యక్ష విధులు ప్రారంభం కానుండగా... డిసెంబర్ చివరినాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరుకానున్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు మాత్రం డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోంను కొనసాగించి జనవరి నుంచి ఆఫీసులో విధులకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించాయి.