Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను చైతన్యపరుస్తున్నది వృత్తే
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గొప్పది
- ఆనాటి యోధుల త్యాగాలతోనే మనకీ స్వేచ్ఛ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్.గోపి
- తెలంగాణ సాహితీ, నవతెలంగాణ పబ్లింగ్ హౌస్ ఆధ్వర్యంలో రైతు కవి సమ్మేళనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనీ, మనకు జీతాలిస్తున్నది రైతులేననికేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపాధ్యక్షులు ఎన్ గోపి అన్నారు. అలాంటి వారి పట్ల పాలకులు కర్కశంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. తన వృత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులు, అన్యాయాలే రైతులను చైతన్యం చేసి ఉద్యమాల్లోకి వచ్చేలా చేస్తున్నాయన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా తెలంగాణ సాహితీ, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ సంయుక్త ఆధ్వర్యంలో రైతు కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే గొప్పగా నిలిచిందనీ, ఒక్కొక్క పోరాట యోధుని గురించి రాస్తే ఒక్కో చరిత్ర గ్రంథం అవుతుందని చెప్పారు. వాళ్ల త్యాగాల వల్లనే విముక్తి పొంది మనం స్వేచ్ఛగా బతుకుతున్నామని చెప్పారు. రైతు ఒక కులానికో, మతానికో చెందిన వాడు కాదన్నారు. రైతు ట్యాక్స్ఫేయర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.రఘు మాట్లాడుతూ..భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికలుగా ప్రచురితమైన విషయాన్ని గుర్తు చేశారు. రైతే దేశానికి వెన్నెముక అనీ, ఆ వెన్నెముకను విరిగేదాకా వంచేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కోవిడ్ వల్ల కొంత స్తబ్దుగా ఉన్నా రైతు ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ బుకహేౌస్ జనరల్ మేనేజర్ కె.చంద్రమోహన్ మాట్లాడుతూ..సమానత్వమున్న సమాజం సిద్ధించినపుడే రైతుకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందన్నారు. మట్టిమనుషులకు మద్దతుగా నవతెలంగాణ తరఫున మరింత సాహిత్యాన్ని తీసుకొస్తామని హామీనిచ్చారు. తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ.. సాధారణంగా పాలకులు డెడ్లైన్లు విధిస్తారనీ, ప్రస్తుతం దేశంలో మాత్రం 22 సెప్టెంబర్, 2022 నాటికి తన డిమాండ్లను నెరవేర్చాలని రైతులే పాలకులకు డెడ్‌లైన్ విధించారని తెలిపారు. అప్పటికీ పాలకులు ఇట్లాగే వ్యవహరిస్తే రైతులు తమ శక్తేంటో చూపెడతారన్నారు. తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తెలంగాణరైతాంగసాయుధ పోరాట క్రమాన్ని వివరించారు. సాహితీ రాష్ట్ర నాయకులు ఎ.మోహన్‌కృష్ణ అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.
ఆలోచింపజేసిన కవితలు
''ఇవాళ దళారులే రైతు భాష మాట్లాడుతున్నారు...పాలకులు ప్రజా ఉద్యమాల పరిభాషలో మాట్లాడుతున్నారు...ఫ్యూడల్ భావజాలానికి ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకుంటున్నారు...మార్కెట్ యార్డు కాకులు పీక్కుతింటున్న రైతు శవంలా ఉన్నది'' అంటూ ఎన్.గోపి తన కవిత ద్వారా పాలకులు రైతులను మోసం చేస్తున్న తీరును కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. ''విరహాన్ని, సందేశాన్ని కడుపునిండా దాచుకుని కవుల రాయబారాలను మోసిన మేఘమా మాకోసం ఒక్కసారైనా కరిగిపోవా...'' అంటూ సాగులో రైతుల ఇబ్బందులను తన మేఘ సందేశం ద్వారా వినిపించారు. ''భూమిని చూసి నేర్చుకుంటున్నట్టున్నది....అందుకే అంత ఓపిక..నీటిని చూసి నేర్చుకుంటున్నట్టున్నది...నీటిలా అంత శక్తి...'' అని రైతు క్షేత్రం కవిత ద్వారా ఆలోచింపజేశారు. కవి జి.దశరథ రామయ్య '' నేను పుట్టిన నేల ఈ తెలంగాణ..ఉద్యమాల ఊపిరిపోసిన జాన..'' అంటూ రైతాంగ సాయుధ పోరాట యోధులను రుథిర దీపిక కవిత ద్వారా స్మరించుకున్నారు. యువ కవి అజరుకుమార్ ''పుడమి తల్లికి పురుడు పోసి..పుట్ల కొద్ది పంట తీసి..పురుగుల మందుతో ఆకలి తీర్చుకుని..'' అంటూ అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలిచావులకు కారణాలను తన కవిత ద్వారా కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. మరో కవి పొత్తూరు సుబ్బారావు 'రెక్కలు తెగిన జీవితం' అంటూ రైతు జీవితాన్ని ఆవిష్కరింపజేశారు. పాలకులు మారినా, రాష్ట్రాలు విడిపోయినా రైతులు బతుకులు మాత్రం మారలేదంటూ కె.ఎల్.కామేశ్వర్రావు 'తెలుగుతల్లి ఆవేదన' కవిత ద్వారా చక్కగా వివరించారు. ఎ.ప్రభాకరాచారితో మరో 20 మందికిపైగా కవులు తన కవితలను వినిపించారు.