Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇల్లు కట్టివ్వాలి
- రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలి : శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్
- బాధిత కుటుంబానికి నేతల పరామర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చైత్ర కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టివ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో చైత్ర తల్లిదండ్రులను శ్రామిక మహిళా సమన్వయ కమిటీ బృందం పరామర్శించింది. ఈ కార్యక్రమంలో రమతో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు వాణి, మీనా, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రావణ్, నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. బృంద సభ్యులు చైత్ర తల్లిని ఓదార్చారు. అనంతరం రమ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందనీ, ప్రతి రోజూ ఏదోఒక చోట లైంగిక దాడుల ఘటనలు వినాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. మద్యం అనర్థాలకు కారణం అవుతున్నదనీ, ప్రతి గ్రామంలోనూ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దాడి ఘటనలు జరిగినప్పుడే హడావిడి చేసి ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. లైంగిక దాడి ఘటనల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట, కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీల్లో, గ్రామాల్లో సీసీ కెమెరాలను విరివిగా ఏర్పాటు చేయాలనీ, పోలీసుల గస్తీని పెంచాలని కోరారు.