Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పగుళ్లతో తెగిపోతున్న చెక్‌డ్యాంలు, కట్టలు
- నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్లు
- అధికారుల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ-జనగామ రూరల్
దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని ఆపి సాగు, తాగునీటి అవసరాల తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లపై పర్యవేక్షణ లేక పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. వాటి నిర్మాణానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నా నాసిరకం పనులతో అవి కొట్టుకుపోతున్నాయి. అధికారులు, నిర్మాణ పనులు చేసిన గుత్తేదారులు కుమ్మక్కవ్వడం, నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనంతో పాటు నీటి వనరులూ వృథా అవుతున్నాయి. ఇది జనగామ జిల్లా రూరల్ మండలంలో నూతనంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌ల పరిస్థితి.
జనగామ డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు వివిధ దశల్లో సర్వే చేసి చీటకోడూరు-యశ్వంతపూర్ వాగుపై నాలుగు భారీ చెక్‌డ్యాములు నిర్మించాలని ప్రతిపాదన చేయడంతో ప్రభుత్వం అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసింది. చీటకోడూర్ రిజర్వాయర్‌కు దిగువన 3కి.మీ అనంతరం ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించేందుకు 2020 డిసెంబర్ 12న స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో ఉస్క బావి వద్ద ఒకటి, రామప్ప గుడి సమీపంలో మరొకటి, రైల్వే ట్రాక్ పై ఇంకొకటి, యశ్వంతపూర్ బ్రిడ్జి దిగువన మరొకటి నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఉస్క బావి వద్ద నిర్మించే చెక్ డ్యాం నిర్మాణానికి రూ.2.33 కోట్లు, రామప్ప గుడి వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.2.73కోట్లు, రైల్వే బ్రిడ్జి వద్ద చెక్ డ్యాంకు రూ.2,75,22,000, యశ్వంతపూర్ బ్రిడ్జి దిగువన చెక్ డ్యాం నిర్మాణానికి రూ.2.73కోట్లు నిధులు మంజూరు చేశారు. వీటికి అదనంగా చెక్‌డ్యామ్‌లకు ఇరువైపులా రాతి కట్టడాలను నిర్మించేందుకు ఉస్కభావి వద్ద కట్టకు రూ.44లక్షలు, రామప్ప గుడి వద్ద కట్టకు రూ.45లక్షలు, రైల్వే బ్రిడ్జి కట్టలకు రూ.31లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఉస్క బావి వద్ద, రామప్ప గుడి సమీపంలో నిర్మించే చెక్‌డ్యామ్ పనులను హన్మకొండకు చెందిన యువశక్తి ఎంటర్ప్రైజెస్ సంస్థ, రైల్వే ట్రాక్ ఎగువన యస్వంత్పూర్ బ్రిడ్జి దిగువన నిర్మించే చెక్‌డ్యామ్ నిర్మాణాలను వీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకొని పనులు చేపట్టింది. స్థల వివాదం కారణంగా ఉస్క బావి వద్ద నిర్మించే చెక్ డ్యామ్ పనులు నిలిచిపోగా మిగతా మూడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ నీటిని నిల్వ చేసేందుకు ఇరువైపులా బలమైన కట్టల నిర్మాణాలు మాత్రం విస్మరించారు. పనుల పర్యవేక్షణ లోపంతో ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి.
చెక్‌డ్యామ్‌లకు ఎగువన, దిగువన వాగుల్లో ఇసుకను తోడటం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతికి దిగువ ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు తెగిపోయాయి. రైల్వేట్రాక్‌పై చెక్‌డ్యాంకు పగుళ్లు వచ్చాయి. యశ్వంతపూర్‌లో నిర్మించిన చెక్‌డ్యామ్ పడింది. చెక్‌డ్యాం కట్టలను మరింత బలోపేతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ జనగామ డీఈ రవీందర్ వివరణ కోరగా చెక్ డ్యామ్‌ల కట్టల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదనీ, ఈలోపే భారీ వర్షాలు కురిసి వరద నీరు చేరడంతో తెగిపోయాయని చెప్పడం గమనార్హం.