Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరతెలంగాణ పోరాటం వక్రీకరణకు బీజేపీ యత్నం
- సాయుధ పోరాటం హిందూ-ముస్లిం కోట్లాట కాదు
- మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాషాయ మూకల కుట్రలు
- కొత్తరూపంలో దోపిడీ సాగించే యత్నాలను తిప్పికొడదాం
- రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి దళితబంధు ఇవ్వాలి
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
రాచరికం, భూస్వామ్యం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రైతాంగ పోరాటం వార్షికోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంంగా ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌గ్రౌండ్‌లో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లిం కోట్లాటగా చిత్రీకరించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అదే అయితే.. బందగీ, షోయబుల్లాఖాన్, మగ్దూం మొయినొద్దీన్ వంటి వీరులు నిజాం ప్రభువు చేతిలో ఎందుకు హతమార్చబడ్డారని ప్రశ్నించారు. వీరతెలంగాణ పోరాటం.. కులమతాలకు అతీతంగా.. నిజాం నిరంకుశత్వం, వేలు, లక్షల ఎకరాలున్న భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిందన్నారు. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి, రాఘవరావు.. తదితర జాగీర్దారులు కల్లాల్లో నూర్పిడి చేసే సమయానికి పంటలాక్కెళ్లేవారని తెలిపారు. వెట్టిచాకిరీపై తిరుగుబాటు చేసిన మొదటి వీరవనిత చాకలి ఐలమ్మ, మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య, తొలి ఆయుధం వడిసేల.. ఇలా రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి.. తదితర వీరులతో పాటు 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. వారి త్యాగ ఫలితంగానే దేశంలో భూసంస్కరణలు, భూ పంపకాలు జరిగాయన్నారు. నెహ్రూ సైన్యం నైజాం సంస్థానాన్ని విలీనం చేసుకున్న తర్వాత కూడా సాగిన పోరాటాల ఫలితంగానే వెట్టిచాకిరీ నిషేధ చట్టం, 38ఈ కౌలుచట్టం, 54 ఎకరాల భూసీలింగ్ యాక్టు.. ఇలాంటివెన్నో అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన భూపంపిణీ కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని చెప్పారు. పోడు రైతుల కోసం తెచ్చిన అటవీ హక్కు చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు. పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ పిల్లల తల్లులపైనా కేసులు నమోదు చేసి జైళ్లో పెట్టించడం దారుణమన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు అమ్ముతూ కొత్తరకం దోపిడీకి పాల్పడుతూ మోడీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను వీర తెలంగాణ పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 22న హైదరబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 27న భారత్‌బంద్, అక్టోబర్ 5న పోడు రైతుల రాస్తారోకోను విజయవంతం చేయాల్సిందిగా తమ్మినేని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో దళితబంధు పథకాన్ని ఏకకాలంలో అమలు చేయాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ డిమాండ్ చేశారు. సభకు ముందు ఖమ్మం నలుమూలల నుంచి భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బత్తుల హైమావతి, ఎం. సుబ్బారావు, పి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
యాద్రాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపెల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. రావి నారాయణరెడ్డి స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనకున్న వందల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి దేశంలోనే ఆదర్శ నేతగా నిలిచారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సంపాదించిన గొప్ప నాయకుడు రావి నారాయణరెడ్డి అని కొనియాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు, యాద్గార్పల్లి, తడకమళ్ల గ్రామాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సన్మానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెంచుపల్గు తండా, లక్ష్మాపురం గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్లుగా పనిచేసి అమరులైన తార్యా నాయక్, కాశన్నల స్థూపాల వద్ద వారి చిత్రపటాలకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ నివాళ్లులర్పించారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ శివారులోని కేవల్ కిషన్ భవన్ సమాధి వద్ద సభ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ పాల్గొని మాట్లాడారు.