Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పుట్టినరోజున యువత నిలదీత
- అధికారంలోకి వస్తే ఏడాదికి రెండుకోట్ల జాబ్లిస్తామన్న బీజేపీ
- సర్కారు సంస్థలన్నీ ప్రయివేట్..కార్పొరేట్ సంస్థల్లో నో రిజర్వేషన్
ఉపాధి కోరుకునే నిరుద్యోగికి ఉద్యోగం రాకపోతే.. ఆ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు కోల్పోతుంది. మాకు అధికారమివ్వండి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తా మంటూ...గద్దెనెక్కిన బీజేపీ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. పకోడాలు అమ్ముకుని బతకాలంటూ కాషాయపార్టీ నేతలు,మోడీ క్యాబినెట్ సహచరులంతా నిరుద్యోగ యువతను సూచనలిస్తున్నారు.మోడీ సర్కార్‌కు ఏడేండ్లు పూర్తయ్యాక కూడా..ఉపాధి మాటేమో కానీ...ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. పైగా సర్కారు సంస్థలన్నీ ప్రయివేట్ పరం చేస్తూ.. కార్పొరేట్ సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవని చెబుతున్నది. మీ బతుకు మీదే అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రధాని మోడీ 71 ఏట అడుగుపెడితే..మా ఉద్యోగాలెక్కడ అంటూ యువత నిలదీసింది.
న్యూఢిల్లీ : కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మలా మారిన మోడీ ప్రభుత్వం...వారి ఆదేశాలను తుచ తప్పకుండా అనుసరించటానికి రెడీ అయిపోతున్నది. ఇందులో భాగంగా దేశశ్రేయస్సును పట్టించుకోవటంలేదు. కేవలం సంపన్నులకు మేలు చేసే నిర్ణయాలను అమలు చేస్తున్నది. దీంతో దేశంలోని యువశక్తి నిర్వీర్యమైపోతున్నది. ఉపాధిలేక నానా అవస్థలు పడుతున్నది.
అయినా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటున్నది. రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అయ్యాక..దాదాపుగా 15 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి తోడు నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతున్నది. తమకు జరుగుతున్న జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళమిప్పారు. ప్రధాని జన్మదినాన్ని నిరుద్యోగ దినంగా పాటించారు. 'జాతీయ నిరుద్యోగ దినోత్సవం' జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మోదీజీకి ధన్యవాదాలు! పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉపాధి కల్పనపై మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పలు పార్టీలు నిలదీశాయి.
నిరుద్యోగం పైపైకి..
20 నుంచి 24 ఏండ్ల వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన వారితో.. అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా చెబుతున్నది. 2017లో ఈ కేటగిరీలో దాదాపు 42 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. 2018 లో, ఈ సంఖ్య దాదాపు 55 శాతానికి పెరిగింది. 2019లో ఇది 63 శాతానికి చేరింది.
నిరుద్యోగ రేటును పరిశీలిస్తే.. గ్రాడ్యుయేట్ డిగ్రీ సంపాదించిన వ్యక్తులలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్నది. జూన్ 2019 నుంచి జూన్ 2020 వరకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రి త్వ శాఖ నిర్వహిం చిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ల అత్యధిక నిరుద్యోగ రేటు 17.2 శాతంగా ఉన్నది. దీని ప్రకారం చదవడం, రాయటంతో పాటు మంచి నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువత ఉపాధిలేక వీధుల్లో తిరుగుతున్నారు.వారికి ఉద్యోగాలు దక్కటంలేదు.
ఉద్యోగప్రకటనలిచ్చి కూడా..
ఒకసారి మతరాజకీయం..మరోసారి నిరుద్యోగుల్ని మాయ చేసింది. దేశానికి యువశక్తే బలమంటూ మోడీ తెగ పొగిడారు. 2019 ఎన్నికల్లో ఉద్యోగాలిస్తామంటూ హామీ ఇచ్చారు. అదిగో..ఇదిగో అంటూ ఎట్టకేలకు కేంద్రం ఉద్యోగప్రకటనలిచ్చింది.
2019 ఎన్నికల ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్..డీ పోస్టులను ప్రకటించింది. లక్షకుపైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. నిర్ణీత ఫీజుతో దేశవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.ఉద్యోగం వస్తుందనే ఆశతో..భారీ ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లారు. కానీ రెండున్నరేండ్లయినా..మోక్షం కలగలేదు.
కేంద్రం గణాంకాలు పరిశీలిస్తే ఒక నెలలో జీతం తీసుకుంటున్న వారి సంఖ్య ఆరు శాతమే. అయితే మిగిలిన ఉద్యోగాలన్నీ అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. వ్యవసాయం, నిర్మాణ రంగంలో అత్యధికంగా ఆధారపడుతున్నట్టు స్పష్టమవుతున్నది.
దేశజనాభాలో 40 కోట్లమంది ఉపాధి కల్పించుకుంటుంటే...వారి సంపాదనపై మిగతా 40 కోట్ల మంది బతుకుతున్నారని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మహేశ్ వ్యాస్ తెలిపారు. ఇందులో దాదాపు 15 కోట్ల జనాభా వ్యవసాయ రంగంలో పనిచే స్తున్నారు. వ్యవసాయ రంగంలో పనిచేసే జనాభా ప్రతి ఒక్కరికీ పొలం ఉన్నట్లుగా ఉండదు. ప్రతి ఒక్కరూ పొలం యజమానిగా ఉండరు. కొంతమంది రైతుల వద్ద మాత్రమే పొలం ఉన్నది. మిగిలిన వారు వ్యవసాయ కూలీలు. ఇతరుల భూమిపై పనిచేసే వారు. రోజూ పని దొరకని వారు. వ్యవసాయానికి కూలీలు అవసరమైనప్పుడు మాత్రమే పని లభిస్తుంది. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం.. వ్యవసాయ రంగంలో సంపాదనను గమనిస్తే... 2019 లో కష్టపడి తర్వాత ప్రతి వ్యక్తికి రోజుకు రూ. 27 మాత్రమే లభించాయి.
పెరగని ఉద్యోగాలు
కాలక్రమేణా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. కానీ గణాంకాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 1980 నుంచి 1990 వరకు వార్షిక ఉపాధి వృద్ధి రేటు 2 శాతం. 1990 నుంచి 2000 వరకు వార్షిక ఉపాధి వృద్ధి రేటు 1.7 శాతానికి తగ్గింది. 2000 నుంచి 2010 వరకు ఉపాధి వృద్ధి రేటు 1.3 శాతానికి తగ్గింది. 2010 నుంచి 2020 సంవత్సరం వరకు, ఉపాధి వృద్ధి రేటు మరింత తగ్గింది మరియు ఇది 0.2 శాతానికి తగ్గింది. వాస్తవానికి స్వాతంత్య్రం వచ్చాక ఉద్యోగాల సంఖ్య పెరగాలి. కానీ గత 40 ఏండ్ల చరిత్రను చూస్తే ఉపాధి వృద్ధి రేటు బాగా మందగించింది.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం, జూన్ 2021 లో నిరుద్యోగ రేటు 9.7 శాతం. జులైలో కొంచెం మెరుగుపడి 6.96 శాతానికి చేరుకున్నది. ఇప్పుడు ఆగస్టులో నిరుద్యోగ రేటు 8.32 శాతంగా ఉన్నది. జులై నుంచి ఆగస్టు వరకు.. కేవలం ఒక్క నెలలో 15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల తలుపులకు కేంద్ర ప్రభుత్వం తాళం వేసింది.ప్రభుత్వ ఉద్యోగాల్లేకుండా.. ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల్లో దోపిడీ జరుగుతున్నదని నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయం, నిర్మాణం వంటి రంగాలలో పనిచేసే కార్మికుల పరిస్థితి అతి దారుణంగా ఉంటుదన్న విషయాలు విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని యువతరం కదిలి.. ప్రధాని పుట్టినరోజును నిరుద్యోగుల రోజుగా మార్చేసింది. ఇందులో యువత ఎలాంటి తప్పు చేయడం లేదు. తమ దేశంలో నివసించే ప్రతి పౌరుడు, మంచి జీవితం కావాలనే కోరికతో పనిని కోరుకుంటాడు. అతను ఉద్యోగం పొందడం కూడా బాధ్యత అవుతుంది. ఒకవేళ అతనికి ఉద్యోగం రాకపోతే..ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భవిష్యత్‌పై భారీ విధ్వంసం. ఏచూరి
దేశంలోని కీలకమైన నిరుద్యోగం, భవిష్యత్‌పై మోడీ ప్రభుత్వం భారీ విధ్వంసానికి పాల్పడుతున్నదని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్ చేశారు. ఉపాధిలేక నిరుద్యోగ లంతా రోడ్డున పడుతుంటే...బీజేపీ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడటం తగదన్నారు. 2016..17 లో 15.66 శాతం నిరుద్యోగులుంటే... 2020..21 నాటికి 28.26 శాతానికి, 2021 ఆగస్టు నాటికి 32.03 శాతానికి చేరిందన్నారు. నిరుద్యోగం పెరుగుతున్నతీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశయువతను నిర్లక్ష్యం చేయవద్దని మోడీ ప్రభుత్వానికి ఏచూరి కోరారు.
నిరుద్యోగులతో అబద్ధాలు
సామర్థ్యం లేని వారు చాలామంది యువత ఉండటంవల్లే ఉద్యోగాలు దక్కటంలేదని కాషాయపార్టీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ఉద్యోగాల తలుపులు మూసేసింది.కేంద్రం, రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం ఉద్యోగాలలో వారి వాటా మూడు శాతం దాటడంలేదు. అంతేకాదు...నెలలో జీతం అందుకునే ప్రయివేట్ రంగాలనూ కలిపితే.. మొత్తం ఉద్యోగాలలో వీటన్నింటి వాటా కేవలం ఆరు శాతం మాత్రమే.జులైలో డీఏ పెంచే సమయంలో 40 లక్షల పోస్టులకు గాను కేంద్ర ఉద్యోగుల సంఖ్య 31.42 లక్షలు వెల్లడించింది. 2016 ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 11.30 లక్షల మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో ఉన్నారు.