Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పరేడ్ గ్రౌండ్లో : దళిత, గిరిజన దండోరా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- మల్లన్న, కొండపోశమ్మ సాగర్లతో 60 వేల ఎకరాల పేదల భూములను లాక్కున్నారు
వతెలంగాణ-మెదక్ప్రాంతీయ ప్రతినిధి, గజ్వేల్
నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి డిసెంబర్9 వరకు నిరుద్యోగ ధర్మయుద్ధం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన 'దళిత, గిరిజన దండోరా' సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్, తురేబాజ్ ఖాన్ లాంటి ఎంతో మంది పోరాట ఫలితంగా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయనుకుంటే.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు తీసుకువచ్చి 14 గ్రామాలకు చెందిన 60వేల ఎకరాల పేదల భూములు లాక్కొని రైతులను సీఎం కేసీఆర్ నట్టేట ముంచాడని ఆరోపించారు. త్యాగాలు ఒకరివి.. పదవులు మరొకరికా అని ప్రశ్నించారు. 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మద్యం ద్వారా రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల ఆదాయం వస్తున్నదనీ, 12 ఏండ్ల పిల్లవాడు కూడా నేడు మద్యానికి బానిసయ్యాడని అన్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారయిందన్నారు. సింగరేణి కాలనీలో ముక్కుపచ్చలారని ఒక గిరిజన బాలికను అత్యంత పాశవికంగా లైంగికదాడి చేసి హత్య చేస్తే.. 7 రోజుల వరకు కూడా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోయారని ఆరోపించారు. ఏడు గంటలు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. బాధిత కుటుంబాన్ని కేటీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నేరేళ్లలో ఇసుక మాఫియాతో బాధలు పడుతుంటే కేసీఆర్‌ను అడిగినందుకు దళిత యువకులపై థర్డ్ డిగ్రీ చేసి సంసారానికి పనికిరాకుండా చేశారని ఆరోపించారు. ఖమ్మంలో మిర్చి పంట కొనుగోలు చేయాలనీ, మద్దతు ధరలు ఇవ్వాలని అడిగిన పాపానికి రైతులను ఉగ్రవాదుల్లాగా అరెస్టులు చేశారన్నారు. గజ్వేల్‌కు చెందిన మురళి ముదిరాజ్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరుకు నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌెండ్లో ధర్మ యుద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లిఖార్జున్ ఖర్గి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి సెక్రటరీ మాణిక్ ఠాకూర్, శాసనసభా పక్ష నాయకులు మల్లు భట్టీ విక్రమార్క, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ పీసీసీ అధ్యక్షులు, కార్యనిర్వహక అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.