Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో..
- హుజూరాబాద్ సీటుని మోడీ ఖాతాలో వేద్దామని పిలుపు
- నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినం సభ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/నిర్మల్
రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో కారు స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి మోడీ ఖాతాలో వేస్తామని దీమా వ్యక్తం చేశారు. దేశంలో రోజుకు కోటి మందికి కోవిడ్ టీకాలు వేస్తున్నామని వివరించారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. రాంజీ గోండు, కుమురంభీం, సర్దార్ వల్లబారు పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా అమిత్‌షా ప్రసంగిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణాకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సర్దార్ వల్లభారు పటేల్ పోలీస్ యాక్షన్ కారణంగా నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని తెలిపారు. నిర్మల్‌లో బ్రిటీష్, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనులు పోరాడారని తెలిపారు. రాంజీ గోండుతో పాటు వెయ్యి మంది ఉద్యమకారులను ఉరి తీశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారని, తాము అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. మజ్లిస్ పార్టీకి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. దేశంలో 60 కోట్ల మంది పేదలకు ఇండ్లు, కరెంట్, శుద్ధనీరు అందిస్తున్నామని, ప్రధానమంత్రి ఆయుష్ యోజన కింద రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ డబ్బులు పంచి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని, అయితే, కార్యకర్తల బలగం, ప్రజల అండతో తామే గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు మొదటి సంతకం పెడతామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మాట్లాడుతూ.. త్యాగధనుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని తెలిపారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్నారు. భైౖంసాలో అమాయకులపై మజ్లిస్ దాడులు చేస్తోందని, టీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. పోడు వ్యవసాయం చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, కేంద్రం వారికి పట్టాలు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నిర్మల్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, మాజీ కేంద్ర మంత్రి హన్సరాజ్ అహిర్, నాయకులు ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాథోడ్ రమేష్ పాల్గొన్నారు.