Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్రం, సాయుధపోరాటాలతో ఆర్ఎస్ఎస్,బీజేపీలకు సంబంధమే లేదు : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ఆ దిశగానే తమకు సంబంధంలేని విషయాల్లో వారు జోక్యం చేసుకొని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యాన శుక్రవారంనాడిక్కడి రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ''హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం-73వ వార్షికోత్సవం'' కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కమ్యూనిస్టుల సాయుధపోరాటం, ప్రజా ఉద్యమాలు నిర్వహించకుండా ఉండిఉంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం సాధ్యమయ్యేదికాదని స్వయంగా సర్దార్ వల్లభారు పటేల్ చెప్పారని గుర్తుచేశారు. చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, హౌం మంత్రి అమిత్‌షా ఆ విషయాలను గమనించాలని సూచించారు. దేశ స్వాంతంత్య్రం, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్రే లేదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్, భారత దేశాన్ని మత రాజ్యంగా పేర్కొనాలని రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌పై ఒత్తిడి తెచ్చిందనీ, ఆయన ఆ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పార్లమెంటు హాలులోకి వస్తూ అక్కడి మెట్లను ముద్దాడారనీ, ప్రజాస్వామ్య చిహ్నం అంటూ కొనియాడారన్నారు. కానీ ఏడేండ్ల ఆయన పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందనీ, ప్రశ్నిస్తే, వ్యతిరేకిస్తే దేశద్రోహం కేసులు పెట్టి హింసిస్తున్నారనీ, ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం ఇది కాదని అన్నారు. ప్రధాని మోడీ చెప్పిన ''అచ్ఛాదిన్, సబ్కా సాత్-సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్- సబ్కా ప్రయాస్'' నినాదాలు కార్పొరేట్లకు మాత్రమే వర్తిస్తున్నాయనీ, వాటివల్ల ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం పేరుతో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నదనీ, దేశాన్ని కాపాడుకోవడం కోసం మరో ప్రజాఉద్యమం నిర్మితం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తిస్తూ సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ ఫ్యూడలిస్టుల పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. భూసంస్కరణలు వచ్చినా, ఇప్పటికీ భూమి కొందరి చేతుల్లోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజల్ని కలవరనీ, అన్ని వ్యవస్థల్నీ ధ్వంసం చేశారనీ, పోడు భూములపై న్యాయం జరగలేదనీ ఆక్షేపించారు. ఉపాధి లేక విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు ఉలుకు పలుకు లేకుండా ఉండటం క్షంతవ్యం కాదన్నారు. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల, మత చీలికలు తప్పు అని చెప్తూ మరో ప్రజాస్వామ్య ఐక్య పరిరక్షణ పోరాటం జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు 'కారంపొడితో కదిలిన సెల్లె...రోకలిబండలు ఎత్తిన పల్లె' అంటూ ఆనాటి వీరగాధల్ని గుర్తుచేస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.