Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఉద్యమంలో మీ పూర్వీకులు ఎవరైనా పాల్గొన్నారా?: అమిత్‌షాకు బివి రాఘవులు సూటి ప్రశ్న
- నిజాం నిరంకుశ పాలనను కూల్చింది కమ్యూనిస్టులే
- బ్రిటిష్ వారికి ఏజెంట్లుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ నాయకులు
- దేశానికి పట్టిన కరోనా మోడీ సర్కార్
- బీజేపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలి
- 27న భారత్‌బంద్‌తో గుణపాఠం చెప్పాలి
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి సుందరయ్య పార్క్ వరకు సీపీఐ(ఎం) ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్ సభలో పాల్గొన్నారు. నిజంగా ఆయన దేశభక్తుడు అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీకి పాత్ర ఉందా?. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారి పూర్వీకులు పనిచేశారా?లేదా?. ఒక్క కార్యక్రమమైనా చేశారా. నిజాం దుర్మార్గాలను, ఫ్యూడల్ విధానాలను ప్రశ్నించారా?. అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. లేదంటే నోరుమూసుకుని ఇంట్లో కూర్చోవాలి. కానీ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారని అబద్ధాలు ప్రచారం చేయొద్దు. చరిత్రను వక్రీకరించొద్దు. నిజాంకు వ్యతిరేకంగా బందగీ, మఖ్దూం మోహియుద్దీన్, షోయబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఇలా హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు.కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఐక్యంగా పోరాటం జరిగింది'అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సభ జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ నిజాం సర్కార్‌ను కూల్చింది, త్యాగాలు చేసింది, హైదరాబాద్ ప్రాంతాన్ని విమోచన చేసింది కమ్యూనిస్టులేనని చెప్పారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైంది సర్దార్ పటేల్ సైన్యం వల్ల కాదన్నారు. ఆ సైన్యం రజాకార్లకు వ్యతిరేకంగా రాలేదనీ, సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టులను హతమార్చిందని అన్నారు. వీరోచిత పోరాటం వల్లే నిజాం సర్కారు భారత ప్రభుత్వానికి లొంగిపోయిందని వివరించారు. సంస్థానాలుండాలనీ, బ్రిటీష్ పాలన కొనసాగాలని ఆర్ఎస్ఎస్ భావించిందని గుర్తు చేశారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు తొత్తులుగా, ఏజెంట్లుగా ఆర్ఎస్ఎస్ నాయకులు పనిచేశారని విమర్శించారు. ఇప్పుడు దేశ సమైక్యత గురించి బీజేపీ నాయకులు మాట్లాడ్డం దెయ్యాలు, వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ప్రజల చరిత్రను కాపాడుకోవాలనీ, దాన్ని వమ్ము చేస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టడంలో, అందరికీ టీకా వేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. దేశంలో ప్రజాస్వామిక హక్కుల్లేవని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లను, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మానిటైజేషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకుని, ఆక్సిజన్ అందించిన సోనూసూద్ ఇండ్లలో ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారని వివరించారు. బ్యాంకులకు పన్నులు ఎగవేసిన విజరుమాల్యా, నీరవ్మోడీలను విదేశాలకు పంపించారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై సీబీఐ, ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయిస్తున్నదనీ, తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని చెప్పారు. ఈ దేశానికి పట్టిన పెద్ద కరోనా మోడీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఈ దేశాన్ని, ప్రజాసామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవిలువలను, ఫెడరలిజాన్ని, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురైందని చెప్పారు. మేకిన్ ఇండియా అంటూనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వేలు, రోడ్లను ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 27న భారత్‌బంద్ ద్వారా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ మోడీ, అమిత్‌షా నుంచి దేశానికి విమోచన కావాలన్నారు. దేశ సంపదను అంబానీకి, అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు.
క్విట్ మోడీ అనాలనీ, లేదంటే ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోయే ప్రమాదముందని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ మోడీ పాలనకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, కర్షకులు సంఘటితమై ఈనెల 27న భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని చెప్పారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, జె వెంకటేశ్, టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, పి ప్రభాకర్, ఆర్ శ్రీరాంనాయక్, హిమబిందు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, కెఎన్ రాజన్న, ఎం దశరథ్, ఆర్ అరుణజ్యోతి, ఎం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెపరెపలాడిన ఎర్రజెండా
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ప్రదర్శన జరిగింది. ఎర్రజెండా రెపరెపలాడింది. అగ్రభాగాన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, డిజి నరసింహారావు పాల్గొన్నారు. వంద మీటర్ల రెడ్క్లాత్తో కార్యకర్తలు ప్రదర్శనలో పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. దారిపొడవునా జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సుందరయ్య విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కార్యకర్తల పాటలు ఉత్తేజపరిచాయి.