Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పందిపంపుల గ్రామంలో ఇటీవల ఫారెస్టు అధికారులు, పోడు సాగుదార్లకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పోడు రైతులను అరెస్టు చేయటం అక్రమమని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. వివాదానికి కారణమైన భూమి వాస్తవానికి రెవెన్యూ పరిధిలో ఉందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడ్ శోభన్ నాయక్ తెలిపారు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా రైతులను వెళ్లగొట్టేందుకు అటవీ అధికారులు చూడటం దారుణమని తెలిపారు. అటవీ హక్కుల చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా, తద్వారా పోడు సాగుదార్లకు న్యాయం చేయకుండా బాధితులను పరకాల సబ్ జైలుకు తరలిస్తామని చెప్పటం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు భూపాలపల్లికి వెళ్లిన ఆయన.. వారిని అడిగి వాస్తవాలను తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.