Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఏఐలో చేరేందుకు ఆసక్తి
- మార్కెట్ అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంపైనే దృష్టి
- ఉద్యోగావకాశాలపై కేంద్రీకరిస్తున్న విద్యార్థులు
- ఈఈఈ, మెకానికల్, సివిల్‌కు నిరాదరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ లేదంటే బైపీసీ అంటే క్రేజీ. అంటే ఇంజినీర్ లేదా డాక్టర్ కావడమే విద్యార్థుల లక్ష్యంగా ఉన్నది. అందుకనుగుణంగా ఎంపీసీ, బైపీసీలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఇక ఇంజినీరింగ్‌లోనూ కొన్ని కోర్సులకే క్రేజీ ఉన్నది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్ (సీఎంఈ), కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్టీ) వంటి కోర్సుల్లో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమలకు కావాల్సిన అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వాటిలో ఎక్కువ మంది చేరుతున్నారు. మార్కెట్ అవసరాలను నైపుణ్యం పెంపొందించుకోవడంపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే, మంచి ప్లేస్మెంట్లు పొందాలంటే ఎంచుకునే కోర్సుపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉండే ప్రొఫెసర్లు, కన్సల్టెంట్ల వద్ద అభిప్రాయాలు తీసుకుని ఆయా కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ఆ కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్లు ఎలా ఉంటాయన్నదానిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాకే సీట్లను ఖరారు చేస్తున్నారు. కోర్సుల్లో చేరడం ఒక ఎత్తయితే కాలేజీలను ఎంచుకోవడమూ మరో ఎత్తు. నచ్చిన కోర్సుతోపాటు ప్రముఖ కాలేజీలోనే చేరేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారు. అందుకే వెబ్‌కౌన్సెలింగ్‌లో ఆప్షన్ ఇచ్చేకంటే ముందే ఆ కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఆ కాలేజీకి న్యాక్ గ్రేడ్ ఉందా?, చేరే కోర్సుకు ఎన్బీఏ అక్రిడిటేషన్ ఉందా?, మౌలిక వసతులున్నాయా, అర్హులైన అధ్యాపకులున్నారా?, తరగతుల నిర్వహణ, ప్లేస్మెంట్లు ఎలా ఉన్నాయి? ఇలా అనేక అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంజినీరింగ్ అంటే ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గుతున్నది. వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. గత కొన్నేండ్లుగా ఇదే వైఖరి కనిపిస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో సీఎస్ఈ కోర్సులో కన్వీనర్ కోటాలో 18,614 సీట్లుంటే, తొలివిడత కౌన్సెలింగ్‌లో 18,561 (99.72 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. 53 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ, సీఎంఈ, సీఎస్టీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్ (ఈటీఎం) కోర్సుల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈలో 88.32 శాతం, ఐటీలో 99.26 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. అంటే ఎక్కువ మంది కొన్ని కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇక సివిల్ ఇంజినీరింగ్‌లో 51.07 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 43.36 శాతం, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లో 4.26 శాతం, ఇండిస్టీయల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో 7.14 శాతం, మైనింగ్ ఇంజినీరింగ్‌లో 52.26 శాతం, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్‌లో 33.33 శాతం, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 41.30 శాతం చొప్పున చేరారు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని పై గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.