Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘాల ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హంతకుణ్ని శిక్షించాలనీ, చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారనీ, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజనసంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే.. ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని సింగరేణి కాలనీ, సైదాబాద్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆయా సంఘాలు దహనం చేశాయి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీరాంనాయక్ , గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి గణేష్ నాయక్, పుట్టంగండి శీను, బంజారా సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు మోతీలాల్ నాయక్, అశోక్, సక్రి బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ చిన్నారి చైత్రను లైంగిక దాడిచేసి హత్యచేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలంటూ గత వారం రోజులుగా పోరాటం చేసిన గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని చెప్పారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ఇప్పటికే ఐదుగురు గిరిజన నాయకులపై కేసులు పెట్టించి అరెస్టు చేయించాడని వారు ఆరోపించారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజన సంఘాలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం మానుకోవాలనీ, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసుల అప్రజాస్వామిక చర్యలను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.