Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం ఆదేశాలకనుగుణంగా మార్గదర్శకాలు ప్రకటించాలి
- పీఎఫ్ఆర్ఐ ప్రధాన కార్యదర్శి పార్థసారధి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని జిల్లాల్లో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (పీఎఫ్ఆర్ఐ) ప్రధాన కార్యదర్శి కె పార్థసారధి డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించి ప్రకటించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీఏల వల్ల సామాన్య ప్రజలకు కలిగే న్యాయంపై ప్రసార, ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. రాష్ట్రంలో పీసీఏ ఉందని ప్రజల్లో చాలా మందికి తెలియదని అన్నారు. 1996లో పోలీస్ సంస్కరణలను కోరుతూ ప్రకాశ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీం కోర్టులో నమోదైందని వివరించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీసీఏలను ఏర్పాటు చేయాలంటూ ఆ సందర్భంగా కోర్టు 2006లో ఆదేశించిందని గుర్తు చేశారు. 2007, జనవరి 3 నాటికి వాటిని నియమిస్తామని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. దీనిపై 2017లో కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసు నమోదైందని అన్నారు. మరోసారి సుప్రీం కోర్టు పీసీఏలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లిందనీ, డివిజన్ బెంచ్ సైతం అదే తీర్పును వెల్లడించిందని వివరించారు. దీనిపై గతేడాది హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని అన్నారు. పీసీఏలను ఏర్పాటు చేసి అమలు చేయాలని సీఎస్‌లు, డీజీపీలను ఆదేశించిందన్నారు. దీంతో ఈ ఏడాది జులై 7న రాష్ట్ర స్థాయితోపాటు హైదరాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో పీసీఏలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కానీ ఇంతవరకూ వాటికి సంబంధించిన మార్గదర్శకాలు, కార్యాలయాల ఏర్పాటు, సిబ్బందికి సంబంధించిన వివరాలను ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో పీసీఏలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కలిగిస్తే వారికి న్యాయం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్ఆర్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమార్, వినాజ్ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.