Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే పరిష్కారం దొరుకుతుంది
- మహిళలపై హింస, లైంగికదాడులపై పలువురు వక్తలు : ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రౌండ్‌టేబుల్‌లో పలు తీర్మానాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మహిళలపై హింస, అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించి సమస్యను పైపైన కాకుండా దాని మూలాల్లోంచి చూడాలి... అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది...' అని పలువురు వక్తలు వ్యాఖ్యానిం చారు. వాస్తవాలు, భౌతిక పరిస్థితుల ఆధారంగా లోతైన విశ్లేషణ చేయక పోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని వారు అభిప్రాయ పడ్డారు. ఈ దిశగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మేధావులు, పౌర సమాజం ఆలోచించాలని సూచించారు. 'హింస-అత్యాచారాల్లేని సమాజం-వీటిని అధిగమించటానికి పరిష్కార మార్గాలు...' అనే అంశంపై భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు బివి విజయలక్ష్మి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కేఎన్ ఆశాలత, పీవోడబ్ల్యూ నేత బండారు విజయ, సామాజికవేత్త దేవి తదితరులు ప్రసంగించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. విజయలక్ష్మి మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి ఘటనకు సంబంధించి పోలీసులు తమ పరిధిని దాటారని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను కూడా వారు తమ చేతుల్లోకి తీసుకోవటం శోచనీయమన్నారు. కాగా ప్రభుత్వం మాత్రం తనకేమీ తెలియనట్టు, పట్టనట్టు వ్యవహరించిందని విమర్శించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అనేక బస్తీలు, మురికివాడల్లోని యువత డ్రగ్స్, మద్యం, గంజాయి మత్తులో తూలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. దేవి మాట్లాడుతూ... గతంలో దిశ, ఇప్పుడు సింగరేణి ఘటనలకు సంబంధించి అటు పోలీసులు, ప్రభుత్వం, ఇటు మీడియా సైతం నిందితుడు కేంద్రంగా వ్యవహరించాయని తెలిపారు. వాస్తవానికి బాధితులు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడవాలని సూచించారు. సింగరేణి ఘటనపై వెంటనే స్పందించని పోలీసులపై ముందు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చి, వారికి ఉపశమనం చేకూర్చేందుకు వీలుగా ట్రామా మేనేజ్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న విషయాన్ని పాలకులు మర్చిపోయారని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి టీవీ చర్చల్లో, బయటా 'బాధితుణ్ని చంపేస్తాం.. నరికేస్తాం...' అంటూ అనేక మంది రక్తదాహంతో ఊగిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సౌదీలో బహిరంగంగా ఉరితీస్తారు, కాల్చేస్తారని గుర్తు చేశారు. అంతమాత్రం చేత అక్కడ అలాంటి ఘటనలు జరక్కుండా ఆగిపోయాయా..? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న రాజు శవాన్ని, ఆఘమేఘాల మీద దహనం చేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
తీర్మానాలు...
- ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అత్యాచారాల నిరోధక కమిటీలను
ఏర్పాటు చేయాలి
- ప్రతి జిల్లాలోనూ మహిళా కోర్టును ఏర్పాటు చేయాలి
- మద్యాన్ని దశలవారీగా నియంత్రించాలి, డి-ఎడిక్షన్ సెంటర్లను
ఏర్పాటు చేయాలి
- బస్తీల్లో గంజాయి, మత్తు పదార్థాలను నియంత్రించాలి
- హెల్త్ క్యాంపులు, అవగాహన సదస్సులను నిర్వహించాలి
- అశ్లీల వెబ్సైట్లను, అలాంటి ప్రకటనలను నిషేధించాలి
- సినిమాలు, సీరియళ్లలో అశ్లీలతను నిషేధించాలి