Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 మందికి సీట్లు
- 31 కాలేజీల్లో వందశాతం భర్తీ
- మిగిలిన సీట్లు 13,130
- సీఎస్ఈకి ఫుల్ డిమాండ్
- సీట్లు పొందని విద్యార్థులు 8,624 మంది
- సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు 23
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 78,270 సీట్లున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీల్లోలో 74,071 సీట్లుంటే 60,941 (82.27 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 115 ఫార్మసీ కాలేజీల్లో 4,199 సీట్లు ఉన్నాయనీ, 228 (5.42 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంజినీరింగ్‌లో 13,130 సీట్లు, ఫార్మసీలో 3,971 సీట్లు కలిపి ఈ రెండు కోర్సుల్లో 17,101 సీట్లు మిగిలాయని వివరించారు. 115 ఫార్మసీ కాలేజీల్లో 3,470 బీ ఫార్మసీ సీట్లకుగాను 182 (5.01 శాతం) మందికి, 54 ఫార్మసీ కాలేజీల్లో 571 ఫార్మాడీ సీట్లుంటే, 46 (8.05 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. బీఫార్మసీలో 3,446 సీట్లు, ఫార్మాడీలో 525 సీట్లు కలిపి 3,971 సీట్లు మిగిలాయని వివరించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్‌ను తప్పనిసరిగా చేయాలనీ, దీనికి ఈనెల 23 వరకు గడువుందని తెలిపారు. తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాతే కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. వెబ్ఆప్షన్లు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో 8,624 మంది సీట్లు పొందలేదని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 5,108 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సున్నా ప్రవేశాలు పొందిన కాలేజీ ఒక్కటీ లేదని తెలిపారు. రాష్ట్రంలో 31 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ చేశామని ప్రకటించారు. ఇందులో వర్సిటీ కాలేజీలు ఆరు, ప్రయివేటు కాలేజీలు 25 ఉన్నాయని వివరించారు.
13 కోర్సుల్లో వందశాతం సీట్ల భర్తీ
రాష్ట్రంలో 46 ఇంజినీరింగ్ కోర్సులున్నాయని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంజినీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 13 కోర్సుల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సీఎస్ఈ ఐవోటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ (సీఐసీ), కంప్యూటర్ ఇంజినీరింగ్ (సీఎంఈ), కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్టీ), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్ (ఈటీఎం), మెటలర్జికల్ ఇంజినీరింగ్ (ఎంఈటీ), మెకానికల్ (మెక్థ్రానిక్స్) ఇంజినీరింగ్ (ఎంసీటీ), బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్స్ (ఎంఎంఎస్), అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (ఏజీఆర్), బయోటెక్నాలజీ (బీఐవో), డెయిరీయింగ్ (డీఆర్జీ) కోర్సులున్నాయని తెలిపారు. సీఎస్ఈ అనుబంధంగా ఉన్న 18 కోర్సుల్లో 38,796 సీట్లుంటే, 37,073 (95.56 శాతం) సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. 1,723 సీట్లు మిగిలాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనుబంధంగా ఏడు కోర్సుల్లో 21,456 సీట్లుకుగాను 16,804 (78.32 శాతం) సీట్లు భర్తీ చేశామని వివరించారు. ఇందులో 4,652 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. సివిల్, మెకానికల్ అనుబంధంగా 12 కోర్సుల్లో 12,764 సీట్లుంటే, 6,289 (49.27 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇందులో 6,475 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. తొమ్మిది ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 1,055 సీట్లకుగాను 775 (73.46 శాతం) మందికి సీట్లు కేటాయించామనీ, 280 సీట్లు మిగిలాయని వివరించారు.