Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటినుంచి మోడీ సర్కారు విధానాలపై అఖిలపక్ష ఉద్యమం
- 27న జరిగే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు జరుగుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన ఆన్లైన్లో శనివారం ఆ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కరోనాను నివారించడంలో, ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనాలో ఉపాధి కోల్పోయిన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులకు నెలకు రూ.7,500 నగదు బదిలీ చేయాలన్న డిమాండ్‌ను అమలుచేయకపోవడంతో కోట్లాది మంది ప్రజలు పస్తులుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గి లక్షల పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారు. మరోవైపు కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలను మోడీ ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ అనుకూల విధానాలను ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యాన ఈ ఉద్యమం సాగుతుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా మోడీ ప్రభుత్వం అమ్మేస్తున్నదని చెప్పారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను కార్పొరేట్లపరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వరంగం విచ్ఛిన్నమైతే లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు రద్దయి సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడమన్నది దేశ ఐక్యత, సమగ్రతకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. పది నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు పోరాడుతున్నా పట్టించుకోకుండా మోడీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్‌బంద్‌ను రాష్ట్రంలో జయప్రదం చేయడానికి అన్ని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు కలిసి రావాలని తమ్మినేని కోరారు.
మతం పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్న బీజేపీ
రాష్ట్రంలో మతంపేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని తమ్మినేని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందార్లకు, జాగీర్దార్లకు అనుకూలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మాతృసంస్థలు వ్యహరించాయని గుర్తు చేశారు. ఆనాడే ప్రజలకు ద్రోహం చేసిన ఈ మతతత్వ శక్తులు తెలంగాణ సమాజ ఐక్యతను భగం చేయడానికి, ప్రజలు సాధించుకున్న భూములను కార్పొరేట్ల వశం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఉద్దేశం ఇదేనని విమర్శించారు. మతం పేరుతో మారణహోమం సృష్టించే ఈ శక్తులను ప్రతిఘటించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.