Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాలనీలో పిల్లలకు భద్రతేది?
- ఐఏపీఎల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక నిందితుడు మరణించటంతోనే నేరాలకు అడ్డుకట్టపడదనీ, నేరాలకు కారణమవుతున్న మూలాల నిర్మూలన జరగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగికదాడి, హత్య, అనంతరం నిందితుడు రాజు మరణం నేపథ్యంలో భారత ప్రజా న్యాయవాదుల సంఘం (ఐఏపీఎల్) సంయుక్త కార్యదర్శి సురేష్ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పోలీసుల సహకారంతో విచ్చలవిడిగా మద్యం, మత్తుపదార్ధాలు, పోర్న్ వీడియోలు అమ్మకాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. లైంగిక దాడులకు కారణాలను వెతికి వాటిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనంత కాలం అవి పునరావతమవుతూనే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం ముందు వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజల ప్రతీకార వాంఛ మంచిదనేనీ, అయితే అది రాజును తయారు చేసిన వ్యవస్థపై జరగాలని ఆకాంక్షించారు. నేరం చేయటానికి వ్యవస్థే అనేక అవకాశాలను కల్పించిందని విమర్శించారు. హిందూ బ్రాహ్మణీయ వ్యవస్థలో మహిళను భోగ వస్తువుగా చూశారనీ, అదే క్రమంలో విద్య, సినిమా, టీవీల్లో కూడా చూపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. నేరాన్ని రూపుమాపే వాటిపై ఆలోచించాలని సమాజానికి సూచించారు. సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సిన పాలకులే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తామంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ ప్రజలకు హక్కులపై అవగాహన లేకుండా ఒక ప్రణాళికా ప్రకారం పోలీసులే ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. పౌరహక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ సింగరేణి కాలనీలో గంజాయితో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అర్థరాత్రి వరకు జరుగుతున్నాయనీ, ఈ విషసంస్కృతిని అరికట్టాలని కోరారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ వ్యవస్థీకృతమైన దుర్మార్గంపై చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఐఏపీఎల్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గుంటూరులో రమ్య విషయంలో ప్రజలకు ఆపగలిగిన అవకాశమున్నా నివారించకపోవటంతో హత్య జరిగిందని ప్రస్తావించారు. పీఓడబ్ల్యూ నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ మహిళలను గౌరవించే విద్యను చిన్నప్పటి నుంచి నేర్పించాలని డిమాండ్ చేశారు. ఓపీడీఆర్ నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ సింగరేణి కాలనీలో చిన్నారులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్ సీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కోర్టులో పిటీషన్ వేసి న్యాయవిచారణకు అవకాశాన్ని సాధించుకోవటం తొలి విజయమన్నారు. నిందితుడు రాజు మతదేహాన్ని ఖననం చేయకుండా దహనం చేయటం ద్వారా ఎరుకల సామాజిక వర్గం మనోభావాలని గాయపరిచారని విమర్శించారు. టీపీఎఫ్ కన్వీనర్ రవిచంద్ర మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు రావాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో ఇంజినీర్స్ జేఏసీ నాయకులు లక్ష్మినారాయణ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు యూసుఫ్ బీ తదితరులు పాల్గొన్నారు.