Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని మతరాజకీయం : టీపీసీసీ చీఫ్ రేవంత్ విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలో రెండువర్గాలు ఉన్నాయనీ, అందులో ఒకటి సీఎం కేసీఆర్ అనుకూలవర్గం, మరోటి వ్యతిరేక వర్గమని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతికి సంబంధించి కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరపాలని కోరుతున్నప్పటికీ, మోడీ సర్కారు పట్టంచుకోవడం లేదని విమర్శించారు. అటు బీజేపీకి, ఇటు కేసీఆర్‌కు మధ్య సయోధ్య కుదిరించేందుకు చిన్నజీయర్‌స్వామి, మైహౌం రామేశ్వరరావు రాయబారం నడిపారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షాకు ఆధారాలతో సహా ఆయనకు ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరితే తమకు సమయం ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు బండి సంజరు, ఎంపీ అరవింద్ టీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాంజీగోండు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు మల్లు రవి, నిరంజన్, రాజయ్య, ఫిరోజ్ ఖాన్, మానవతా రారుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాంజీగోండు, కాశీం రిజ్వీకి మధ్య వంద సంవత్సరాల తేడా ఉందనీ, అయినా బీజేపీ నేతలు దానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారని విమర్శించారు.
అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ ఎంపీ సోయం బాబురావు పోటో పెట్టకుండా ఆయనను అవమానించారని చెప్పారు. కోకాపేట భూములను మైహౌం రామేశ్వరరావుకు, రాజ్‌పుష్ప సంస్థకు అడ్డంగా అప్పగించారని ఆరోపించారు. దానిపై ఇప్పటికే సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో చిన్నజీయర్‌స్వామి, మైహౌం రామేశ్వరరావు లాబీయింగ్ చేశారని విమ ర్శించారు. డ్రగ్స్ కేసుతో తనకేమీ సంబంధం లేదంటూ మంత్రి కేటీఆర్ చెబుతున్నప్పటికీ ఎందుకు కేంద్రానికి సహకరించడం లేదని ప్రశ్నించారు. కేసు మూసేయమంటూ కోర్టులో ఎక్సైజ్ శాఖ అఫిడవిట్ వేసిందని గుర్తు చేశారు. సినీనటులు రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ పిలిచి విచారించినప్పటకీ ఎక్సైజ్ శాఖ ఆరోజు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దానిని అడ్డుకున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఈ విషయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద చర్చకు వస్తా.. వైట్ ఛాలెంజ్‌లో భాగంగా వస్తా.. మీరు ఇద్దరూ అక్కడికి రండి' అని సవాల్ విసిరారు.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నమూనాలు ఇద్దామంటూ సూచించారు. బండి సంజరు బడాయి మాటలు బంద్ చేయాలని కోరంరు. మీ రిమోట్ కేసీఆర్ చేతిలో ఉంది అనిఎద్దేవా చేశారు.. కేసీఆర్ రిమోట్ మీద తెలంగాణలో బీజేపీ నడుస్తున్నదని చెప్పారు. 170 ఏండ్ల కింద జరిగిన వాటిని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందే తప్ప అమిత్ షా పర్యటన దేనికి ఉపయోగ పడలేదని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన హామీలను సాధించలేదని విమర్శించారు.