Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవనశైలి మార్చుకోవటం అవసరం : పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాద్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా తర్వాత దేశంలో అసాంక్రమిక వ్యాధులు (వ్యాప్తి చెందని వ్యాధి) పెరుగుతున్నాయని అపొలో స్పెక్ట్రా ఆస్పత్రి గుండె శస్త్ర చికిత్స నిపుణులు పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాద్‌రావు తెలిపారు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు తదితర వ్యాధులు ఇందులో ఉంటున్నాయన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అధ్యక్షతన 'కరోనా-గుండె జబ్బులు' అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో వైద్యం ప్రగతి సాధించినా అది ప్రజల వద్దకు వెళ్లటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణానికి కారణమవుతున్న ప్రధాన జబ్బుల్లో ఒకదాంతో మరోదానికి సంబంధముందని వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చేవాటితోపాటు పొగాకు వాడకం, ఆల్కహాల్ సేవించటం, శారీరక శ్రమ తగ్గటం తదితర అలవాట్లు కూడా జబ్బులు పెరగడానికి కారణమవుతున్నాయని వివరించారు.
అన్ని పదార్ధాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మధుమేహం, బీపీని నియంత్రణలో పెట్టుకోవాలని కోరారు. నిద్రలేమికి ఒత్తిడి కారణమవుతున్నదన్నారు. గుండె జబ్బుల బారిన పడితే మందులతో తగ్గుతుందా? స్టంట్స్ వేసుకోవాలా? శస్త్రచికిత్స చేయాలా? గుండెమార్పిడి అవసరమా? అనే వాటిని వైద్యులు నిర్ణయిస్తారనీ, ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదించి సలహా తీసుకోవాలని సూచించారు. గుండె రక్తనాళాల్లో, కవాటాల్లో జబ్బులు వస్తాయనీ, పిల్లల్లో గుండెలో రంధ్రం, రక్తనాళాల్లో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష చేయటం ద్వారా తదుపరి చికిత్సను నిర్ణయించగలుగుతారని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కీ హౌల్ సర్జరీలు వస్తున్నాయని వివరించారు. మనుష్యులకు - జంతువులకు మధ్య అనేక పోలికలున్నాయనీ, మనుష్యులు మాత్రమే నూనెలను వాడుతుంటారని తెలిపారు. ఏదైనా మితంగా తీసుకోవాలని సూచించారు. నూనె వాడకం మానేసిన వారిలో గుండె జబ్బులు తగ్గటం గమనించినట్టు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులో లేదనీ, ప్రజలకు అందుబాటులోకి రాని వైద్యం కనుమరుగవుతుందన్నారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్న జన విజ్ఞాన వేదికను అభినందించారు.