Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దళితులు
నవతెలంగాణ-తాడ్వాయి
తమ గణేశ్ నిమజ్జన శోభాయాత్రను అగ్ర కులస్తులు అడ్డుకుని, మహిళలని చూడకుండా బూతులు తిడుతూ దూషించారని దళితులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన దళితులు ఆదివారం తాడ్వాయి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఏఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివాడ గ్రామంలో శుక్రవారం రాత్రి అంబేద్కర్ సంఘం గణేష్ శోభాయాత్ర మొదలైంది. శనివారం మధ్యాహ్నం వేళ అగ్ర కులాలకు చెందిన కొందరు గణపతి నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా వారి గణపతి తీసుకొచ్చి దళితుల యాత్రకు అడ్డంగా పెట్టారు. ఎందుకు పెట్టారని అడిగితే మీ దళితుల గణపతి మా అగ్రవర్ణాల గల్లీలోకి రావద్దని అడ్డుకున్నట్టు తెలిపారని ఆరోపించారు. మహిళలను సైతం ఇష్టం వచ్చినట్టు బూతుమాటలతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను దూషించిన అగ్ర కులస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకునే వరకూ రోజూ పోలీస్‌స్టేషన్‌కు వస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో నందివాడ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ముద్దు నరేష్, బీఎస్పీ మండల కన్వీనర్ బాబు సాయి కుమార్ మహారాజ్, సంఘ నాయకులు మారంగల్ల శంకర్, మాడే చిన్న రాజయ్య, మండలాధ్యక్షులు పోతరాజు సాయిలు, మండల కార్యదర్శి ముద్దు సాయిలు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.