Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తి శిక్షణ ఇవ్వాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో రజక ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్, సౌత్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది రజకుల్లో అత్యధికం రజకవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారు అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ, పరిష్కరించాల్సిన తెలంగాణ రాష్ట్ర రజక ఫెడరేషన్‌కు పాలకవర్గం లేకపోవడం వల్ల రజకుల సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి ద్వారా ఆదాయం తగ్గడంతో కుటుంబపోషణ భారంగా మారిందనీ, అందుకే ప్రభుత్వం ప్రతి రజక కుటుంబానికి రూ.5 లక్షల వరకు రుణాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2017, 2018లో కేటాయించిన రూ.450 కోట్ల నిధులు ఖర్చు చేయలేదనీ, కాగితాల్లోనే బడ్జెట్ చూపించి మోసగించారని విమర్శించారు. రాష్ట్రంలో 17 చోట్ల నిర్మించ తలపెట్టిన వాషింగ్ ప్లాంట్లను మూడేండ్లవుతున్నా పూర్తి చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిర్మాణాలు నత్తనడకన నడుస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఏడేండ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్‌కు వెంటనే పాలకవర్గం నియమించి వృత్తి శిక్షణ, వృత్తి ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివిధ ప్రభుత్వ సంస్థల వృత్తి కాంట్రాక్టు పనులను రజక సొసైటీలకు ఇవ్వాలనీ, ఈనెల 26న జరగనున్న వీరనారి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పైన ఆమె విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నిర్మించే రజకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు సి.మల్లేష్, జ్యోతి, ఉపేందర్, మేడ్చల్, హైదరాబాద్ సెంట్రల్, సౌత్ జిల్లాల అధ్యక్షులు అంబేచక్రపాణి, వెంకటస్వామి, పి.రాములు, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బాతరాజు లింగస్వామి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్లు రాపర్తి ప్రభాకర్, రేవల్లీ నరేష్, సర్దార్ అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.గోపాల్, రమేష్, యాదగిరి, వెంకన్న, కృష్ణ, దర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.