Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న భారత్‌బంద్ జయప్రదం చేయాలి
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
- ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ -నల్లగొండ
రైతు వ్యతిరేక మూడు చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం తుమ్మల వీరారెడ్డి, పల్లా దేవేందర్ రెడ్డి, వసుకుల మట్టయ్య, పుట్ట సత్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా 11 నెలలుగా రైతులు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వానపడ్డ చందంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నరేంద్ర మోడీ తనను గెలిపిస్తే మంచి రోజులు తెస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో ప్రజలను ముంచి కార్పొరేట్లకు మంచిరోజులు తెస్తున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక కోడ్లను, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆదాయాలు పడిపోయి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే పట్టించుకోని సర్కార్ నిత్యవసర వస్తువుల, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. బంద్ జయప్రదానికి ఈ నెల 21, 22 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25, 26 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు చేయాలనీ, పెద్ద ఎత్తున పోస్టర్, కరపత్రం పంపిణీ చేయాలని, అన్ని ప్రజా సంఘాల జనరల్ బాడీలు నిర్వహించాలని, సోషల్ మీడియా ద్వారా భారత్ బంద్ డిమాండ్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, కున్రెడ్డి నాగిరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు, పి.ప్రభావతి, ఎండి సలీం, ఎండి మైనుద్దిన్, బీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.