Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్‌భవన్, మియాపూర్ బస్‌బాడీ యూనిట్లలోని కార్మికులకు తక్షణం జీతాలు చెల్లించాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కె హన్మంతు, కన్వీనర్లు వీఎస్ రావు, పి కమాల్‌రెడ్డి, కో కన్వీనర్లు పి రమేష్‌కుమార్, జి అబ్రహం, కె యాదయ్య, ఎస్ సురేష్, బి యాదగిరి, పి హరికిషన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాల్లోని ఆర్టీసీ కార్మికులకు ఈనెల 14న జీతాలు చెల్లించారనీ, పై ప్రాంతాల్లోని ఉద్యోగులకు మాత్రం 19వ తేదీ దాటినా ఇంకా జీతాలివ్వలేదని తెలిపారు. సంస్థలో కార్మికుల జీతాల చెల్లింపును ప్రతినెలా 1వ తేదీనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 27న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని ప్రకటించామనీ, అదే సమయంలో సంస్థకు నూతన మేనేజింగ్ డైరెక్టర్ నియామకం జరగడంతో వారి గౌరవసూచకంగా ఆ ఆందోళనను వాయిదా వేసినట్టు వివరించారు. సెప్టెంబర్ నెలలో కూడా జీతాలు ఇప్పటికీ రాలేదనీ, సోమవారం నాటికి కార్మికుల ఖాతాల్లో జీతాలు పడకుంటే, ఈనెల 21(మంగళవారం)న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఈ నిరసనల్లో పాల్గొనాలని పిలపునిచ్చారు.
ఇబ్బంది పడుతున్నారు-టీఎమ్‌యూ
సకాలంలో జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి తిరుపతి, ఏ రామచంద్రారెడ్డి తెలిపారు. ఈమేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నూతన ఎమ్డీబాధ్యతలు స్వీకరించాక సీసీఎస్ డబ్బులు, పదవీవిరమణ చేసిన ఉద్యోగుల చెల్లింపులు వేగవంతం అయ్యాయనీ, జీతాలు మాత్రం ఒకటో తేదీకి రావట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరికీ ఒకేరోజు జీతాలు చెల్లించాలని కోరారు.