Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణపై మొక్కుబడి చర్యలే..
- ప్రజాధనం దుర్వినియోగం
- పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదల కోసం ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్న సబ్సిడీ బియ్యం దారి మళ్లుతున్నాయి. నిరుపేదలకు నోటిముద్దగా మారాల్సిన బియ్యం అక్రమ రవాణా అవుతున్నది. ఇది మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నది. అక్కడక్కడా రేషన్‌బియ్యం పట్టివేత అన్న దాఖలాలే తప్ప దీన్ని పూర్తిగా నియంత్రించేందుకు నిఘా వ్యవస్థ పటిష్టంగా పని చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2017-18లో నలుదిక్కులా నిఘా పెంచి అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపటంతో ఆగిపోయింది. బియ్యం అక్రమ రవాణా తిరిగి పుంజుకోవటం చర్చనీయాంశమవుతున్నది. జీపీఎస్ సిస్టంపై పూర్తిగా ఆధారపడి అధికారులు అక్రమ రవాణాను ఆపాలనుకున్నప్పటికీ ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నది. అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్న బియ్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బియ్యం దారిమళ్లి రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నట్టు సమాచారం. ఇటీవల సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వంత జిల్లా కరీంనగర్ గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాండు అంజయ్య, గంటి వెంకయ్య వ్యక్తులు మరికొందరితో కలిసి ఈ అక్రమాలను చేస్తున్నట్టు గుర్తించారు. ఇదే మాదిరిగా గతంలోనూ కొన్ని జిల్లాల్లో అక్రమ రవాణా బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఎందుకిలా?
రాష్ట్రంలో వరంగల్ జిల్లా మహబూ బాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర బఫర్ జోన్లు, అక్కడ్నుంచి మండల కేంద్రాల్లో ఉన్న గోడౌన్ల వరకు జీపీఎస్ పని చేస్తున్నది. అయితే పలు సందర్భాల్లో అక్రమార్కులు తమ పని చక్కబెట్టుకునేందుకు జీపీఎస్ సాంకేతిక లోపాన్ని కూడా ఆసరా చేసుకు ంటున్నారు. దీనికితోడు గ్రామాల్లో, పట్టణాల్లో రేషన్ బియ్యం వాడని వారి నుంచి కొనుగోలు చేసి సేకరించి తరలిస్తున్నారు. బమోమెట్రిక్, ఐరీష్ వంటి అత్యాధునిక పద్దతులు ఉన్నప్పటికీ చాకచక్యంతో రేషన్ దారి తప్పుతున్నది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దీన్ని తరలించేందుకు రోడ్డు మార్గంలో నిఘా ఉంటుండటంతో రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో ఇందుకోసమే మెరికల్లాంటి అధికారులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగు వారాలపాటు ప్యాసెంజర్ రైళ్లను తనిఖీ చేసి అడ్డుకట్ట వేసిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం ఆ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేకుండా కేవలం ఇన్ ఛార్జి కమిషనర్ తోనే నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఆ శాఖలో ఉన్నతాధికారుల అండదండలు లేకుండా ఇది సాధ్యమయ్యే పని కాదనే వాదన కూడా ఉన్నది. కింది స్థాయిలో కొంత మంది పోలీసులు, రైస్ మిల్లర్లు కూడా మిలాఖత్ అయి దందా నడిపిస్తున్నట్టు వినికిడి.