Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్ధారించేది ఎవరు?
- ఎన్కౌంటర్లే పరిష్కారమా...
- చట్టాలు, కోర్టులు ఎక్కడీ
- ఆందోళన కలిగిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్కౌంటర్... ఎక్కడ, ఏ నేరం జరిగినా ఇప్పుడు వినిపిస్తున్న మాట! నేరమూ, శిక్ష ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రభుత్వాలు దేన్ని అమలు చేస్తున్నాయి? చట్టాలు, కోర్టులు మౌనం దాలుస్తున్నాయా? ఒకప్పుడు ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు అనగానే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యేవి. రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు ప్రజల్లో కొందరి వైపు నుంచే ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు వస్తుండటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు విఘాతమే! నేరాల తీవ్రత వేరైనా... విచారణ జరపకుండా, నేరం రుజువు కాకుండా, న్యాయస్థానం శిక్ష విధించకుండా చట్టాలను చేతుల్లోకి తీసుకొని రాజ్యం హింసను ప్రేరేపించడం రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడైనా ఏదైనా నేరం, ఘోరం జరిగినప్పుడు బాధితులు, ప్రజలు భావోద్వేగాలకు గురవ్వడం సహజం. కానీ ప్రభుత్వం సంయమనం పాటించాలి. భావోద్వేగాలను నియంత్రించాలి. చట్టబద్దంగా కేసులు నమోదు చేయాలి. నిందితులకు వేగంగా కోర్టుల్లో శిక్షలు పడేలా పక్కా వ్యూహం, ప్రణాళికతో వ్యవహరించాలి. దానికి భిన్నంగా ప్రజల భావోద్వేగాలను శాంతపర్చడం కోసం ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఎన్కౌంటర్లు చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశం. సింగరేణి కాలనీలో ఆరేండ్ల పసిపాపపై ఓ కామాంధుడు దుర్మార్గానికి ఒడిగట్టాడు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని బాధితులు, కొన్ని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నిందితుడిని ప్రభుత్వంతోనే హత్య చేయించాలనే స్థాయిలో ఆందోళనలు సాగాయి. చివరకు ఊహించినట్టుగానే పోలీసులు తమ చేతికి మట్టి అంటకుండా, 'ఆత్మహత్య'ను ప్రకటించారు. అతడిని చంపేస్తారని ప్రజలందరికీ తెలిసిన తర్వాతే 'ఆత్మహత్య' జరిగింది. నిందితుడిని చంపి రైలు పట్టాలపై పడేశారా...లేక మద్యం తాగించి, సృహలేని సమయంలో పట్టాలపై పడుకోబెట్టారా...లేక నిందితుడే మరో దారిలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలు పోలీసుల విచారణ, న్యాయస్థాన పర్యవేక్షణలో తేలాల్సిన అంశాలు. అంతకుముందు వరంగల్ యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత అక్కడే నెలల పసికందుపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటీవల జరిగిన 'దిశ' నిందితుల ఎన్కౌంటర్ ప్రభావం సింగరేణి కాలనీ బాలిక హత్య కేసుపైనా పడినట్టే కనిపిస్తున్నది. 'దిశ' బాధితురాలు ఎక్కువ కులం అనీ, సింగరేణి ఘటనలో పసిగుడ్డు తక్కువ కులం అనే చర్చా నడిచింది. వాళ్లకో న్యాయం, మాకో న్యాయమా అనే ప్రశ్నలూ ఉద్భవించాయి. చివరకు ప్రభుత్వం ''సమన్యాయం'' చేసేందుకే ప్రయత్నించినట్టు కనిపించింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలు అత్యంత ఆందోళనకరం. వాటిని కచ్చితంగా నిరోధించాల్సిందే. అదే సమయంలో రాజ్యాంగం, చట్టాలు, కోర్టులనూ గౌరవించాలి. ఇటీవలే గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం కేసులో సెక్యూరిటీగార్డు, ల్యాబ్ టెక్నీషియన్లపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత అసలు అత్యాచారమే జరగలేదనీ, అది తప్పుడు కేసు అనీ తేలింది. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తన బారుఫ్రెండ్ అత్యాచారం చేశాడని ఓ యువతి కేసు పెట్టింది. విచారణలో అలాంటిదేం జరగలేదని తేలింది. దాన్ని తప్పుడు కేసుగా పోలీసులు నిర్ధారించారు. అలాగే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఫార్మసీ విద్యార్ధిని తనను ఘట్కేసర్లో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానంతో కొందరు ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించారు. ఓ దశలో అక్కడా ఎన్కౌంటర్ జరుగుతుందనే పుకార్లు వ్యాప్తి చెందాయి. కానీ ఆ కిడ్నాప్ కథే ఉత్తిదని తర్వాత తేలింది. మహిళలపై నేరాలను నేరంగా చూడకుండా దాన్ని కులంతో ముడిపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒరవడి సమాజంలో ఆందోళనను రేకెత్తిస్తుంది. రేపు మరో మైనార్టీ ఘటన జరిగితే అప్పుడు మళ్లీ హిందూ, ముస్లిం...సమన్యాయం అంశం తెరపైకి వస్తుంది. నేరాన్ని నేరంగానే చూడాలి తప్ప, దానికి కులం, మతం అంటగట్టడాన్ని వ్యతిరేకించాలి. ఈ భావోద్వేగాల మధ్యే ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయి. నేరాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన క్రిమినల్ కేసుల్లోని నిందితుల ఎన్కౌంటర్లలో వారంతా పూర్తి పేదరికంలో ఉన్నవారే కావడం గమనార్హం. నిర్భంధ విద్య అమలు కాకపోవడం, తాగుడును ప్రభుత్వమే వ్యాపారంగా మార్చడం, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం, సెల్ఫోన్లలో అశ్లీల బూతు ప్రపంచాన్ని నిలువరించలేకపోవడం వంటి అనేక కీలకాంశాల నుంచి ప్రభుత్వాలు పలాయనం చిత్తగించడం కండ్లముందు కనిపిస్తున్న వాస్తవం. వ్యవస్థలను మార్చకుండా, సామాజికాంశాలను పట్టించుకోకుండా ఎన్కౌంటర్లు చేసుకుంటూ వెళ్లడం సరైనదేనా...ఈ సంస్కృతిని భవిష్యత్‌లో మరో రూపంలో పాలకులు ప్రజలపై ప్రయోగించరని విశ్వసిద్దామా?