Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులారా..! కార్మికుల జీవితాలెందుకు పట్టవు
- 15 ఏండ్ల కిందటి జీవోలూ అమలు కావట్లేదు
- ఏడెనిమిది వేల జీతంతో ఎట్ల బతుకుతరు?
- వలస కార్మికుల దగ్గరకెళ్లండి..బాధలేంటో తెలుస్తరు
- దోపిడీ, లాభాలు తప్ప సంక్షేమం పట్టించుకోని యాజమాన్యాలు : కార్మిక గర్జన పాదయాత్ర బృంద సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''కార్మిక శాఖ అధికారులారా. పరిశ్రమల్లో 15 ఏండ్ల కింద జారీ చేసిన కనీస వేతనాల జీవోలు కూడా అమలు కావడం లేదు. వలస కార్మికులతో యాజమాన్యాలు గొడ్డుచాకిరీ చేయిస్తున్నాయి. బందరుదొడ్లలాంటి రూముల్లో ఉంటున్న వారి దగ్గరకు ఒక్కసారైనా వెళ్లి చూడండి. వారి బాధలేం టో మీ కండ్లకు కనిపిస్తాయి. అసలు మీరున్నారా? ఉంటే, పరిశ్రమల్లో తనిఖీలెందుకు చేయరు? ఏ ఒక్క పరిశ్రమలోనూ కనీసవేతనాలు ఇస్తలేరన్న సంగతి తెల్వదా? తెలిసినా యాజమాన్యాలకు సాగి లపడి గమ్ముగా ఉంటున్నారా?' అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, కార్మికగర్జన పాదయాత్ర బృంద సభ్యులు పాలడుగు భాస్కర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 73షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధిం చిన కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్లను రద్దు చేయా లని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక గర్జన పాదయాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. పరిశ్రమల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ఇస్తున్న వేతనాలు, కార్మికుల ఇక్కట్లపై తమదృష్టికి వచ్చిన అంశాలను పాలడుగు భాస్కర్ నవతెలంగాణతో పంచుకున్నారు. ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే..
పీఎఫ్, ఈఎస్ఐ ఇస్తే ఒట్టు
ఇప్పటి వరకు 11 రోజులు పాదయాత్ర పూర్తయింది. కార్మి కులు ఎక్కడికెళ్లినా సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. యాజమాన్యాలే అడ్డుకోవాలని చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 15 ఏండ్ల కిందటి కనీస వేతనాల జీవోలను కూడా అమలు చేయట్లేదు. స్థానిక కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది..లాభాలు తగ్గుతాయనే దురుద్దేశంతో పరిశ్రమల యాజమాన్యాలు వలస కార్మికులను ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఏ పరిశ్రమలోనూ వారికి ఏడెనిమిది వేలకు మించి ఇవ్వడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ ఎక్కడా వర్తించట్లేదు. వాటి గురించి అడిగితే అవేంటి సార్ అని తిరిగి అడుగుతున్నారు. కొన్ని పరిశ్రమల్లో యాజమాన్యాలు, కాంట్రాక్టు సంస్థలు అరకొర జీతాల నుంచీ పీఎఫ్ కట్ చేస్తున్నయిగానీ జమచేయడం లేదు. ఇదో పెద్ద దోపిడీ.
ఉండే గదులూ షిప్టుల పద్ధతిలోనే కేటాయింపు
వలస కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు కనీస వసతులు కూడా కల్పించట్లేదు. కంపెనీల్లో 8ఫీట్ల రేకుల రూములను కేటాయిస్తున్నాయి. ఒక్కో దాంట్లో ఆరుగుర్ని ఉంచుతున్నారు. ఫస్ట్షిప్టులో ఇద్దరు డ్యూటీకెళ్తే మిగతా నలు గురు విశ్రాంతి తీసుకుంటున్నారు. సెకండ్ షిప్టులో ఇద్దరు డ్యూటీకెళ్తే మిగతా నలుగురు పడుకుంటున్నారు. ఇద్దరు జనరల్ షిప్టులో ఉంటారు. పనిలోనే కాదు నివాస స్థలాల్లో నూ షిఫ్టులుండటం దారుణం. అవీ ఎడ్లకొట్టాలకంటే కంటే ఘోరంగా ఉన్నాయి. పందికొక్కులు, ఎలుకలు తిరగటాన్ని, మట్టి తోడిపోయటాన్ని కండ్లార చూశాం. ఆ కార్మికులతో 12 గంటల నుంచి 15 గంటల దాకా పనిచేయిస్తున్నారు. వలస కార్మికుల చట్టం ప్రకారం స్థానిక కార్మికుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అదనపు సౌకర్యాలు కల్పించాలి. తమ రాష్ట్రాలకు పోయేందుకు, వచ్చేందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీలను యాజమాన్యాలే భరించాలి. ఇవేవీ వారికి దక్కట్లేదు. మధ్యదళారులు, పరిశ్రమల యజమాను లు కుమ్మకై వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు.
స్థానికులకు ఉపాధి ఉత్తిమాటే..అంతా కాలుష్యమే
యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం ప్రాంతంలో 1620 ఎకరాల భూమి గ్రీన్ ఇండిస్టీ కోసం కేటాయించారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి. కానీ, స్థానికులకు అందులో ఉపాధే లేదు. స్వరాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియా మకాలు, భూములు మనకే దక్కుతాయని ఉద్యమ సమ యంలో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తేలుతున్నది. కంపెనీల్లో నూటికి 90 శాతం వలస కార్మికులే కనిపించారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల పేరిట చౌకధరలకు భూములను అప్పగించే ప్రయత్నం వేగంగా జరుగుతున్నది. పన్నులు, కరెంటు విషయంలో రాయితీలూ ఇస్తున్నది. అదే సమయంలో స్థానికులకు ఉపా ధి అవకాశాలు కల్పించాలనే సోయిని మరిచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెద్దపెద్ద రసాయన పరిశ్రమ లున్నాయి. దీంతో అక్కడ భూగర్భ జలాలు కాలుష్యమైపోయి చర్మ, శ్వాసకోస, తదితర దీర్ఘకా లిక వ్యాధులు వస్తున్నాయి. బోర్ల నుంచి పచ్చని నీళ్లు వస్తు న్నాయి. రసాయన వ్యర్థాలనూ కంపెనీలు దొంగచాటున వాగుల్లో, వంకల్లో వదులుతున్న పరిస్థితి కనిపించింది.
యూనియన్లు లేవు..చర్చలు లేవు..
1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం ఒక పరిశ్రమ లోని కార్మికులు పెట్టుకున్న సంఘంలో 50 శాతం వరకు బయటి వ్యక్తులు నాయకత్వం వహించే అవకాశం ఉన్నది. మోడీ సర్కారు పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా దాన్ని ఇద్దరికి కుదించింది. కంపెనీ యాజమాన్యాలతో జీతాల బేర సారాలు, హక్కుల గురించి మాట్లాడే బృందంలో పరిశ్రమ లోని కార్మికులే ఉండాలని చెబుతున్నాయి. యాదాద్రి భువ నగిరి జిల్లాలోని ఎస్వీ గ్రానైట్స్‌లో వర్కర్లే తప్ప వేరే వారు లోనికి రావొద్దు. ఏమున్నా కార్మికులే మాట్లాడుకోవాలి అని యాజమాన్యం తన లాభాపేక్ష బుద్ధిని ప్రదర్శిస్తున్నది. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని వాయిత్ ఇండియా పరిశ్రమ బయటి వ్యక్తులను లోనికి రానివ్వట్లేదు. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని గోదావరి పాలిమర్స్‌లో 18నెలలుగా వేతన ఒప్పం దం ఆగిపోయింది. కోడ్ అమలులోకి రాకముందే ఈ పరిస్థి తి ఉంటే ముందుముందు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ చ్చు. కార్మికవర్గం మీద ఒకప్పుడు యాజమాన్యాలు దాడులు చేసేవి. ప్రభుత్వం దగ్గర కార్మికులు విన్నవించుకంటే న్యా యం దక్కేది. ఇప్పుడు యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి దాడిచేస్తున్నాయి. చట్టసభల్లో పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యం పెరగడమే దీనికి కారణం. గతంలో లేబర్ చట్టాలు అమలు కాకపోతే కార్మికశాఖ ఉద్యోగులు తనిఖీలు చేపట్టి నోటీసులు, జరిమానాలు విధించేవారు. ఇప్పుడు అవేవీ కనిపించట్లేదు. బోర్డులులేని ఫ్యాక్టరీలు, ఒకబోర్డుతో అనేకఫ్యాక్టరీలు కన బడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈవిషయంలో జోక్యం చేసు కోవాల్సిన అవసరముంది. యూనియన్లు, హక్కులు, కనీస వేతనాల కోసం కార్మికుల్లోసంఘటితమై పోరాటాలు చేయా లనే కాంక్ష పెరుగుతున్నది. పాదయాత్రచేసే సందర్భంలో పేదలు, కార్మికుల ఇండ్లలో బస చేసి అక్కడే తింటున్నాం. సామాజిక కోణంలోనూ వారి సమస్యలను పరిశీలిస్తున్నాం.