Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతాం
- రాజకీయ పార్టీల సమావేశంలో నిర్ణయం
- భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు
- 30న కలెక్టర్లకు వినతిపత్రాలు
- పోడు సమస్యపై 5న రాస్తారోకోలకు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరు చేయాలని నిర్ణయించారు. అఖిలభారతస్థాయిలో బీజేపీయేతర19 రాజకీయ పార్టీల పిలుపుమేరకు మన రాష్ట్రంలోనూ రాజకీయ పార్టీలు సమావేశమైన ఉద్యమ కార్యాచరణను చర్చించాయి. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమెక్రస,ీ టీజేఎస్,సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఇంటిపార్టీకి చెందిన నాయకులు హాజరయ్యారు. పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరల పెరుగుదల, ధరణీవెబ్సైట్ సమస్యలు, పోడు భూములు, వ్యవసాయ, రైతాంగం, భూసమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.
సర్కార్ల మెడలు వంచుతాం..
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
కేసీఆర్, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు చేసి, సర్కారు మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తాం. దేశంలో బీజేపీ నిరంకుశవైఖరిపై వ్యతిరేకత పెరిగిపోయింది.మోడీ, కేసీఆర్ ప్రజలను అణచివేతకు గురిచేస్తున్నారు. ప్రజల జీవనవిధానం విధ్వంసమవుతున్నది. పోడు సమస్యను పరిష్కారిస్తామన్న సీఎం కేసీఆర్ ఆ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ, టీఆర్ఎస్యేతర పార్టీలతో కలిసి ఐక్య పోరాటం చేయాలని నిర్ణయించాం.
రాజకీయ పార్టీల పిలుపులను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలి. భూసేకరణ పేరిట అసైన్డ్భూములు లాక్కోవడం సరైందికాదు.
- టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం
పోడుసాగుదార్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం హింసకు పాల్పడుతున్నది. నాడు వైఎస్ఆర్ గిరిజనులకు లక్ష మందికి హక్కులు పత్రాలు ఇచ్చారు.కేసీఆర్ ఒక హక్కుపత్రం కూడా ఇవ్వలేదు.
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర
సహాయ కార్యదర్శి పోటు రంగారావు
20 ఏండ్ల కింద విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఐక్యమైన పార్టీలు...నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మళ్లీ ఒక్కతాటిపైకొచ్చి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ బీజేపీకి, టీఆర్ఎస్కు పెద్దతేడా లేదు. ఆ పార్టీల విధానాలను తిప్పికొడదాం.
- తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. పౌరహక్కుల గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే హక్కులు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. మధుయాష్కీ, మల్లు రవి,వేం నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్) డిజి నరసింహారావు (సీపీఐ(ఎం), ఎన్ బాలమల్లేశ్ (సీపీఐ), ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు (టీజేఎస్), కె.రమ (సీపీఐ(ఎంఎల్) న్యూడెక్రసీ) తదితరులు ఉన్నారు.
పోరాటం తీవ్రతరం చేస్తాం..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
కేసీఆర్, మోడీ ప్రజావ్యతిరేక విధానాల పై పోరాటం తీవ్రతరం చేయనున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు అమ్మేస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై తీవ్రభారం మోపుతున్నది. అదానీ, అంబానీ కంపెనీలకు దేశాన్ని కట్టబెట్టేస్తున్నారు. నిజాం పాలనను మించి కేసీఆర్ పాలన నడుస్తున్నది. వీటికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రతిపక్షాలంటేనే భయం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
పోడుభూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం అనగానే కేసీఆర్‌కు భయం పట్టుకున్నది. అందుకే పోడు సమస్యలపై కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీలతో కాలయాపన చేస్తూ కంటితుడుపు చర్యలు చేపడితే ఊరుకునే ప్రసక్తేలేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది. ప్రజాసమస్యలపై కదనరంగంలో ముందుండాల్సిన అవసరమున్నది. బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని మధ్యయుగాల్లోకి తీసుకపోతున్నది. రైతు వ్యతిరేక సాగు చట్టాలు, కార్మికకోడ్‌లు, కార్పొరేట్లకు అనుకూల విధానాలతో బీజేపీ ముందుకుపోతున్నది. రాష్ట్రంలో భూస్వామ్య విధానంలో పాలన నడుస్తున్నది. దళితులకు మూడెకరాలు, దళిత బంధు అంటూనే వివిధ పేర్లతో వారి భూములు లాక్కుంటున్నారు. అటవీ హక్కుల చట్టం 2006ను తుంగలోకి తొక్కి ఆ భూముల నుంచి గిరిజనులను తరిమేసే చర్యలను ఉపసంహరించుకోవాలి.
ఉద్యమ కార్యాచరణ..
- బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై 22న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా.
- 27న భారత్ బంద్‌లో ప్రజాసంఘాలు, పార్టీల కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపు
- 30న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి. అంతకు ముందే రాజకీయ పార్టీల జిల్లా నాయకులు సమావేశమై కార్యచరణ రూపకల్పన చేయాలి.
- అక్టోబర్ 5న పోడు సమస్యలపై రాస్తారోకోలు, ఆది లాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు రోడ్ల దిగ్బంధం చేయాలి.