Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దంకి దయాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమను ద్వేషిస్తూనే ఉన్నా తాము ప్రేమిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ తెలిపారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన, కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న భాషను విమర్శించే ముందు, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఎలాంటి భాష వాడారో చూసుకోవాలని హితవు పలికారు. వైట్ ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంటుందనీ, యూత్ కాంగ్రెస్ దాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకే రేవంత్ ఈ సవాల్‌ను విసిరారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మానవతారారు మాట్లాడుతూ పరువు నష్టం దావాతో కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంకోసారి రేవంత్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు.
కేటీఆర్....విలీనం విలువ తెలుసుకో :జి.నిరంజన్
సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనమైందనే చారిత్రక, విలువైన విషయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవగాహన పెంచుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ సూచించారు. భారతదేశంలో విలీనం కాకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. విలీనంలోనూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో కాంగ్రెస్ పార్టీది కీలకపాత్రని చెప్పారు. విలీనోద్యమ పోరాటంలో పాత్ర లేని బీజేపీ మతతత్వంతో పబ్బం గడుపుకోవాలని చూస్తుంటే, తమ డొల్లతనం బయటపడకుండా ఆ దినోత్సవానికి ప్రాధాన్యత లేదన్నట్టు టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు.