Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లను హైకోర్టు అనుమతి తీసుకుని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సోమవారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. రాష్ట్రంలో ఈనెల ఒకటి నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైందనీ, తరగతులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరూ ఆర్థికంగా పేదలు, బడుగు బలహీనవర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. కేజీబీవీల్లో అనాథ, పాక్షిక అనాథ బాలికలు చదువుతున్నారని వివరించారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండి పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగంలో చదివే దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఈ విభజన ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల మధ్య అభ్యసన అంతరాలకు కారణమౌతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి తగ్గిందనీ, మూడో దశ వచ్చే అవకాశం లేదని వివరించారు. పిల్లలపై ప్రభావం తక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ సంచాలకులు స్పష్టం చేశారని గుర్తు చేశారు.