Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజానన్ మాల్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాతావరణ శాఖ హెచ్చరికలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాకుల నిర్వహణ, వంతెనల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజానన్ మాల్య మాట్లాడుతూ.. రైళ్లు పట్టాలు తప్పడం వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.పాయింట్స్మెన్లు, ట్రాక్మెన్లకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. రైల్వే ట్రాకుల సమీపంలోని చెరువులు, కుంటల వద్ద వరద నీరు పారుతున్న స్థాయిలను తెలుసుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలన్నారు. జోన్లో చేపడుతున్న నూతన రైల్వేలైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనుల పురోగతి, సరుకు రవాణాపై సమీక్షించారు. ప్రస్తుత పండుగల సీజన్ మరియు రైళ్ల సంఖ్యను పెంచిన దష్ట్యా, రైళ్ల నిర్వహణలో సమయపాలన పాటించేలా సాధ్యమైన చోట్ల రైళ్ల వేగ పరిమితి ఆంక్షలను తగ్గించి రైళ్ల రవాణాలో వేగవంతానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సరుకు రవాణా ద్వారా ఆదాయం పెంచుకునేందుకు నూతన మార్గాలను అన్వేషించాలని బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లకు (బీడీయూలు) సూచించారు. అంతేకాక, సరుకు రవాణ రైళ్ల వ్యాగన్లలో నష్టాల నివారణకు లోడింగ్, అన్లోడింగ్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమరాలను ఏర్పాటు చేయాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు.