Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ, మున్సిపల్ సిబ్బంది వేతనాలు పెంచాలి
- మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది వేతనాలు పెంచాలనీ, జీపీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అక్టోబర్ ఎనిమిదో తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ సంఘాలు) పిలుపునిచ్చాయి. కార్మికులంతా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆ యూనియన్ల ఆన్లైన్ సమావేశం సోమవారం జరిగింది. మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, అధ్యక్షులు ఖమర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి జన్ను ప్రకాష్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి. గణపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మహేష్, గణేష్, ఈశ్వర్, పాలడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మున్సిపాల్టీలు, పంచాయతీల్లో పనిచేసేవారిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాల పేదలు, మహిళలేనన్నారు. వారికి కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలనీ, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు. కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్లలో కనీస వేతనాల జీఓల సవరణ 13 ఏండ్ల నుంచి జరగలేదనీ, ఫలితంగా సఫాయి కర్మచారీ కార్మికులకు కూడా వేతనాలు పెరగడం లేదని చెప్పారు. పిఆర్సి కమిటీ కనీస వేతనాన్ని కేటగిరీల వారీగా రూ.19 వేలు, రూ.22,900, రూ.30,040 సిఫారసు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తగ్గించి జీఓ నెం.60ని జారీ చేయడం దారుణమన్నారు. ఈ సమ్మెను రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.