Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ పునరుద్దరణలో తెలంగాణ భేష్ : యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళి ముందున్న అతి పెద్ద సవాల్ అని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ ఎయిడ్) మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఫారెస్ట్ 2.0 సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. మెదక్ జిల్లాలో మూడేండ్లలో ఫారెస్ట్ ప్లస్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (కంపా), నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వీణారెడ్డి మాట్లాడుతూ..బీహార్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు జిల్లాలను ఎంచుకుని యూఎస్ ఎయిడ్ ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు చేస్తున్నామన్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అడవుల పునరుద్దరణ, జీవవై విధ్యాన్ని కాపాడుతూ భౌగోళిక మార్పులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అటవీ పునరుద్ధరణ నిర్వహణలో చేయడంలో తెలంగాణ భేష్ అని కొనియాడారు. పీసీసీఎఫ్ ఆర్.శోభ మాట్లా డుతూ.. అటవీ పునరుద్దరణ, ఫారెస్ట్ ప్లస్ పనుల పర్యవేక్షణకు క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని యూఎస్ ఎయిడ్ బృందాన్ని కోరారు. ఫారెస్ట్రీ మేనేజ్మెంట్, అమెరికా పద్ధతులు, కొత్త టెక్నాలజీని అధ్యయనం చేసేందుకు తెలంగాణ అధికారుల బృందం అమెరికాలో పర్యటించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు వీణా రెడ్డి అంగీకరించారు.
పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు తీసుకుం టున్న చర్యలను అధ్యయనం చేసేందుకు యూ.ఎస్ ఎయిడ్ తరపున తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఫారెస్ట్ ప్లస్ నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ కోరారు.
యూఎస్ ఎయిడ్ ఫారెస్ట్రీ సీనియర్ అడ్వయిజర్ వర్గీస్పాల్, డెవలప్మెంట్ స్పెషలిస్ట్ వంశీధర్‌రెడ్డి, సీనియర్ డెవలపమెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మార్తావాన్లీయిసౌట్, అడిషనల్ పీసీసీఎఫ్ వినరుకుమార్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ సి.శరవనన్, ఫారెస్ట్ ప్లస్ 2.0 తెలంగాణ రీజనల్ డైరెక్టర్ జి.సాయిలు, తదితరులు పాల్గొన్నారు.