Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండ్రి పరిస్థితి విషమం
నవతెలంగాణ-నస్పూర్
బైక్‌పై వెళుతున్న వారిపై పిడుగు పడి తల్లీకొడుకు మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన ఆడే వెంకటేష్(36) తండ్రి సింగరేణి కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యాడు. వెంకటేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ ఉపాధి నిమిత్తం మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద నివాసం ఉంటున్నారు. చిన్న కుమారుడైన శ్రీయాన్కు జ్వరం రావడంతో భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై మంచిర్యాలలో ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చూపించుకొని తిరిగి వస్తుండగా, మంచిర్యాల ఫ్లై ఓవర్‌పైకి రాగానే అకస్మాత్తుగా వర్షం మొదలై బైక్‌పై ప్రయాణిస్తున్న వారిపై పిడుగు పడింది. దాంతో అతని భార్య మౌనిక(28), చిన్న కుమారుడు శ్రీయాన్ (18నెలలు) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేష్ తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో చికిత్స అందజేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. వెంకటేష్‌కు పెద్ద కుమారుడు విశ్వతేజ్(5) ఉన్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకటేష్‌కు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపడిన సమయంలో మంచిర్యాల నుంచి సీసీసీ పోలీస్‌స్టేషన్ వైపు వెళ్తున్న రూరల్ సీఐ కుమారస్వామి తన వాహనం ఆపి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఏసీపీ అఖిల్ మహాజన్‌కు సమాచారం చేరవేయడంతో పాటు పోలీస్ సిబ్బందే స్వయంగా మృతదేహాలతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకటేష్‌ను స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లో ఎక్కించారు.