Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఫ్టీయూ డిమాండ్
- భారీ ర్యాలీ.. కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు వందలాది మంది కార్మికులతో ఐటీఐ గ్రౌండ్ నుంచి కార్మిక శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే 4 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చారనీ, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, కార్మికులను దోచుకోవడంలో మోడీ, కేసీఆర్ పోటీ పడుతున్నారని విమర్శించారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌లో ఐఎఫ్టీయూ శ్రేణులు విస్తృత సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముత్తెన్న, దాసు, రాష్ట్ర నాయకులు నరేందర్, వెంకన్న, రాజేశ్వర్, భూమన్న, జిల్లా నాయకులు మల్లేష్, సత్తెక్క, మురళి, సూర్య శివాజీ, కిషన్, 600 మంది కార్మికులు పాల్గొన్నారు.