Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సీపీఐ(ఎం) నాయకులపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు అధికమయ్యాయని పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. సోమవారం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. మూడేండ్లుగా కలకోవ గ్రామంలో అధికార పార్టీ ఆగడాలు అధికమయ్యాయన్నారు. ఈ విషయమై సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు తాము నిర్ణయించుకున్నామన్నారు. అయితే, కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బుర్రి శ్రీరాములును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అండదండలతో గ్రామంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్ల కింద సీపీఐ(ఎం) నాయకులు సురభి వీరయ్య స్మారక స్తూపాన్ని కూడా కూల్చివేశారన్నారు. గ్రామంలో అనేక మంది తమ పార్టీ నాయకులపై దాడులు జరిగాయన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో నిరంతరం ఆలజడులు రేపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏండ్లు గ్రామంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా గ్రామాభివృద్ధి కోసం పాటుపడిం దన్నారు. పోలీసులు గ్రామంలో జరుగుతున్న అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బుర్రి శ్రీరాములుకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఆయనను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, కొక్కిరేణి సింగిల్‌విండో చైర్మెన్ చందా చంద్రయ్య, ఆరే రామకృష్ణారెడ్డి, నర్సింహుల గూడెం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ జూలకంటి కొండారెడ్డి విజయలక్ష్మీ, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు.