Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- వెల్ఫేర్‌బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలి : బీసీడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటంరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వెజరీ కమిటీని నియమించాలనీ, పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 4న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్. కోటంరాజు ప్రకటించారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ఏఎల్ఓ, ఏసీఎల్, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. చలో హైదరాబాద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా సమయంలో బోర్డు కార్డు రెన్యూవల్ చేసుకోని కార్మికులకు నష్టపరిహారాలు అందించాలనీ, సంక్షేమ బోర్డు నుంచి అక్రమంగా సివిల్ సప్లరు శాఖకు దారి మళ్ళించిన రూ.1,004 కోట్లు బోర్డులో తిరిగి జమచేయాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలనీ, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వేల పెండింగ్ క్లైమ్స్‌కు నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరని నిబంధన పెట్టడం సరిగాదన్నారు. ప్రభుత్వాలే 15 ఏండ్లుగా రేషన్‌కార్డు ఇవ్వకపోతే కార్మికులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. రెన్యూవల్ విషయంలోనూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహస్తున్నామనీ, ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి పుల్లారావు, అనిల్, సందీప్ పాల్గొన్నారు.