Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యంపై చర్య తీసుకోవాలని బాధితుల ధర్నా
నవతెలంగాణ-కాశిబుగ్గ / మట్టెవాడ
వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ సమీపంలోని గంగా ఆస్పత్రిలో డెలివరీ కేసులో కవల శిశువులు మృతి చెందిన ఘటన చర్చానీయాంశమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంటనే ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లో సంచలనం రేపడంతో వరంగల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ గంగా ఆస్పత్రిని తన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఘటన వివరాలు వెల్లడించారు. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన దంపతులు హరీశ్, కళ్యాణం శ్రీవాణి.. శ్రీవాణికి గతంలో రెండు సార్లు గర్భ విచ్చిత్తి అయ్యింది. అనంతరం మూడో సారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో గంగా ఆస్పత్రిలో రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నది. కాగా, 6 నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఉమ్మనీరు పోతుండటంతో హుటాహుటిన గంగ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. కాగా, వైద్యులు ఆమెకు నొప్పులు తగ్గడానికి ఇంజెక్షన్లు ఇచ్చి డెలివరీ చేశారు. ఐదు నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు.. ఒక శిశువు 400 గ్రాములు, మరో శిశువు 380 గ్రాములు తక్కువ బరువుతో పుట్టి మృతిచెందారు. పూర్తి విచారణ నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని డీఎంహెచ్ఓ తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ పద్మశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ ప్రకాష్, డాక్టర్లు హర్ష వర్ధిని, డాక్టర్ సందీప్ తదితరులున్నారు.