Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య, భూపాల్
నవతెలంగాణ-బాలానగర్
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ సంస్థలతో పాటు, స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తోందని, దీన్ని కార్మికలోకం ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, కార్యదర్శి భూపాల్ అన్నారు. సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర సోమవారం మేడ్చల్ జిల్లా బాలానగర్ ఇండిస్టీయల్ ఏరియాకు చేరుకుంది. రాజుకాలనీలో బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసి, పోరాడేందుకు సీఐటీయూ పాదయాత్ర చేపట్టిందన్నారు. కేంద్రం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల ఉద్యోగ భద్రతతోపాటు, దేశ భద్రతకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడిందన్నారు. కరోనా సమయంలో ఉద్యోగులకు ఇచ్చే డీఏను నిలిపివేయడం, రాయితీలను ఒక్కొక్కటిగా తొలగించడం, అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను కూడా నాలుగు కోడ్లుగా మార్చడం వంటి నిర్ణయాలు సరికాదన్నారు. సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్, బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, జిల్లా కోశాధికారి సబిత, నాయకులు శంకర్, అరుణ్, టీఈఈయూ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు, గిరిజన సంఘం నాయకుడు కృష్ణానాయక్, జీహెచ్ఎంసీ కార్మికులు రమ, లక్ష్మి, నాయకులు కరుణ, ఉమ, భారతి, సరిత, పి.శంకర్, సాయి, సతీస్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.