Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీలో పెంచిన లబ్దిదారుల వాటా ప్రభుత్వమే భరించాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర కార్యాలయం పేషీలతో పాటు గొర్రెల పెంపకందార్ల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమానికి 2017 జూన్ 20వ తేదీన 75 శాతం సబ్సిడీపై (రూ.93,750) 25 శాతం (రూ.31,250) లబ్దిదారుని వాటాతో గొర్రెల పంపిణీ ప్రారంభించిందని తెలిపారు.'' రెండేండ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామంటూ 7,61,716 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. కానీ నాలుగేండ్లు పూర్తైనా ఇప్పటివరకు కేవలం 3,76,793 మందికి మాత్రమే గొర్రెల పంపిణీ చేశారు. మూడేండ్ల క్రితం 25 వేల మంది గొల్లకురుమల చేత ఒక్కొక్కరి నుంచి రూ.31,250 డీ.డీ.లు తీయించి ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుని అర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారని వివరించారు. తమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా ఇటీవల 10 వేల మందికి పంపిణీ చేశారనీ, ఇంకా 12 వేల మంది పైగా వేచి చూస్తున్నారని'' తెలిపారు.
ప్రభుత్వం ఇప్పుడు యూనిట్ విలువను రూ.1.25 లక్షల నుండి రూ.1.75 లక్షలకు పెంచా మనే పేరుతో మూడేండ్ల క్రితం డీజీలు తీసిన వారు కూడా ఇప్పుడు అదనంగా మరో రూ.12,500 తీయాలనీ, అలా తీస్తేనే గొర్రెల పంపిణీని చేస్తామని పశు వైద్యాధికారులు గొల్లకురుమలపై ఒత్తిడి చేయడం తగదన్నారు. రెండేండ్లలో పంపిణీని లక్ష్యంగా పెట్టుకొని మూడేండ్లు గడుస్తున్నా గొర్రెలను పంపిణీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దీనికి కురుమ యాదవులను బలి చేయడం సరికాదనీ, పునరాలోచించి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామనీ, అవసరమైతే ప్రభుత్వాన్ని కోర్టు బోనులో నిలబెడతామని రవిందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య, రాష్ట్ర నాయకులు ఎక్కలదేవి కొమురయ్య, ఎల్లంల సత్యనారాయణ, తుమ్మేటి బాలకష్ణ, భావని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.