Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిర్ణయంతో వరి సాగుకు దూరంగా ఉండాలి
- ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
- నేనూ సాగు చేస్తా.. : మంత్రి కేటీఆర్
- సిరిసిల్ల జిల్లాలో అవగాహనా సమావేశం
నవతెలంగాణ - సిరిసిల్ల
కేంద్రం దొడ్డు బియ్యం కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని.. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ, నాప్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్రావు, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి పంటల మార్పిడిపై అవగాహన సమావేశం నిర్వహించారు. పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా కలిగే లాభాలను రైతులకు తెలియజేయడం, తదితర అంశాలపై మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రైతుబిడ్డగా, రైతుగా ముఖ్యమంత్రికి రైతుల సమస్యల గురించి అవగాహన ఉందని, అందువల్లే పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం, రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి చెప్పారు. ధాన్యాన్ని పండించడంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికే బాంఢాగారంగా మారిందని, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిందని, రైతులు వచ్చే యాసంగి కాలంలో వరి కాకుండా ఇతర పంటలను సాగు చేసేలా వ్యవసాయ అధికారులు ప్రోత్సాహించాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ చేసినట్టు చెప్పారు.
ఎగువ మానేరు జలాశయం, అన్నపూర్ణ జలాశయం, శ్రీ రాజరాజేశ్వర జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. మల్కపేట జలాశయం నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాల సామర్థ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. చెరువులు ఎప్పటికీ నిండి ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఆయిల్‌పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని, జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో సగటున వంద ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా వ్యవసాయ విస్తరణ అధికారి రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా రైతు వేదికల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా దిశానిర్దేశం చేయాలని చెప్పారు. జిల్లా నుంచి రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులను ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు తీసుకెళ్తామని, అక్కడ ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న తీరును స్వయంగా పరిశీలించొచ్చని అన్నారు. మోహినికుంట గ్రామంలో పదిహేను ఎకరాల స్థలం తీసుకుని తాను కూడా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తానని మంత్రి వెల్లడించారు.
సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ రెడ్డి, ఇన్చార్జి డీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.