Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లస్థలాలివ్వాలి.. హెల్త్ కార్డులు పనిచేసేలా చూడాలి
- పాత్రికేయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి : టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే, టీబీజేఏ నేతల డిమాండ్
- ఐఅండ్‌పీఆర్ కమిషనరేట్ వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, అర్హులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే, టీబీజేఏ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నానుద్దేశించి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ.. ఏడేండ్లుగా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని విమర్శించారు. కరోనాతో 100 మంది జర్నలిస్టులు చనిపోయారన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక రాష్ట్రంలో 450 మంది జర్నలిస్టులు మరణించారనీ, వారి కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో కేసుందనే నెపంతో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. కార్పొరేట్, ప్రయివేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు పనిచేయట్లేదనీ, ఆ ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. జర్నలిస్టులపై దాడులు తీవ్రమయ్యాయనీ, వాటిని అరికట్టేందుకు ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల తరహాలో ప్రత్యేకంగా జర్నలిస్టు రక్షణ చట్టాలు మన రాష్ట్రంలోనూ తేవాలని కోరారు.
మహిళా జర్నలిస్టులకు పత్రికా, టీవీ ఛానళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రెస్‌అకాడమీ ఉన్నా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదనీ, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐఅండ్పీఆర్కు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని కోరారు. ఎన్ఏజే మాజీ జాతీయ కార్యదర్శి ఎం. కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు ఆగమవుతు న్నాయనీ, రోడ్లకెక్కి పోరాటాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు, మీడియా సంస్థలకు కుదిరిన ఒప్పందాల వల్ల జర్నలిస్టులను పాలకులు పట్టించుకోని దుస్థితి నెలకొందన్నారు. యాజ మాన్యాలు జర్నలిస్టులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నాయనీ, వేతనాలు మాత్రం సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏవీ నర్సింగరావు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు లోపాలను ఎత్తి చూపితే సద్విమర్శగా తీసుకుని సమస్యల పరిష్కారాలకు ప్రయత్నించేవన్నారు. నేటి పాలకులకు అది కొరవడిందని విమర్శించారు. ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ప్రజాప్రతి నిధులున్నారన్నారు. జర్నలిస్టులపైనా, ప్రజాస్వామ్యవాదుల పైనా దాడులు తీవ్రమయ్యాయన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు తేవాలన్నారు. హెచ్‌యూజే అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్ మాట్లాడుతూ..కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పెండింగ్‌లో పెట్టడం తగదన్నారు. సమాజంలో అందరి సమస్యలను పట్టించుకుంటున్న రాష్ట్ర సర్కారు జర్నలిస్టుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్యల పరి ష్కారం కోసం ఉద్యమాలు చేయాల్సి న దుస్థితి జర్నలిస్టులకు నెలకొంద న్నారు. హెచ్‌యూజే కార్యదర్శి కె.నిరంజన్ మాట్లాడుతూ.. ప్రయి వేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు ఎక్కడా వర్తింపజేయ ట్లేదనీ, వాటిని అమలయ్యేలా చూడాలని కోరారు. హెచ్‌యూజే ఉపాధ్యక్షులు పద్మరాజు మాట్లాడుతూ..ఒక్క శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలవడానికి రూ.2 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టుల సంక్షేమం పట్టదా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం రాజకీయ ఎజెండా కాకపోతే వచ్చే ఎన్నికల్లో వారే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సలీమా, రాష్ట్ర నాయకులు మాణిక్‌ప్రభు, హెచ్‌యూజే నాయకులు నాగవాణి, పాండు, విజయానంద్, రాజశేఖర్, దామోదర్, నవీన్, శివశంకర్, ప్రశాంత్, సర్వేశ్వర్రావు, శ్రీధర్, రమేశ్, రాజేందర్, రేణయ్య, శశికళ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.