Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, నిజామాబాద్ సిటీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పేర ఏర్పాటైన ఈ కమిటీల్లో పెత్తందార్లు చేరి అణగారిన వర్గాలపై జులం ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లోని పలు మండలాల్లో ఏదో ఒక గ్రామంలో బహిష్క రణల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం దత్తత గ్రామం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న మోతే గ్రామంలో సుమారు 200 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. దాంతో బాధితులంతా సోమవారం కలెక్టరేట్ కు తరలివచ్చారు. బహిష్కరణకు పాల్పడిన వీడీసీపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. బాధితుల కథనం ప్రకారం..
మోతే గ్రామంలో అన్ని సామాజికవర్గాలకు చెందిన ఏడు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి వినియోగించాలని దళితులు కోరగా.. 'ఆ స్థలం పంచుకున్నాం.. ఒకవేళ అది కావాలంటే మీరు కొనుగోలు చేయాలి' అంటూ చెప్పారు. అయితే ఇటీవల ఆ స్థలంలో దోబీఘాట్ నిర్మాణానికి వీడీసీ ప్రతిపాదించింది. తమ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టించే డబుల్బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థలం ఇవ్వబోమని చెప్పి, దోబిఘాట్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పైగా రజకులు తమని అంటరానివారిగా చూస్తూ తమ బట్టలను ఉతకడం లేదనీ, అలాంటి వారికి గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం ఎలా ఇస్తారని దళితులు నిలదీశారు. దాంతో తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అంటూ దళితులపై వీడీసీ జులం ప్రదర్శించింది. తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనే గ్రామంలో స్థానం ఉంటుం దని హెచ్చరికలు జారీ చేసింది. పైగా 200 దళిత కుటుంబాలను బహిష్కరించింది. మాల, మాదిగలకు చెందిన వ్యవసాయ పనులకు ఇతరులెవరూ వెళ్లొద్దని ఆదేశించింది.
చివరకు దళిత వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు అవసరమైన కుండ కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఇదేంటని అడిగితే వీడీసీ తీర్మానం చేసిందని చెబుతున్నారు. ఒకవేళ వీడీసీ నిర్ణయాన్ని కాదని ఏమైనా చేస్తే తమనూ బహిష్కరిస్తారని ఇతర సామాజిక తరగతుల ప్రజానీకం భయపడుతు న్నారు. మోతే గ్రామకమిటీలో ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు చేరి అణగారిన వర్గాలను ముఖ్యం గా దళితులను ముప్పతిప్పలు పెడుతు న్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధితులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.