Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజిల్ ధరలు పెరిగినా టికెట్ రేటు పెరగలేదు
- పీఆర్సీ, వేతనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు
- ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తాం: టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వంలాగా ఆస్తులను అమ్ముకోమని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుతామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. తనపై నమ్మకంతో ఆర్టీసీ చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎంతోపాటు తనకు సహకరించిన వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం టీఎస్ఆర్టీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన బస్‌భవన్‌లో ఎండీ సజ్జన్నార్‌తో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆసియాలోనే నెంబర్ వన్‌గా ఉన్న సంస్థ నష్టాలబారిన ఎందుకు పడిందో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. కష్టపడే తత్వమున్న సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమితులు కావడం శుభపరిణామన్నారు. ఇద్దరం కలిసి కార్మికులు, ఉద్యోగుల సహకారంతో ముందుకెళ్తామన్నారు. రోజూ రూ.13 కోట్ల ఆదాయం ఉండే సంస్థ.. కరోనాతో రూ.3 కోట్లకు తగ్గిందన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోందని, ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని, సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామని తెలిపారు. పీఆర్సీ, వేతనాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇతర దేశాల్లోలాగా బస్సుల కోసం వేచివుండే ధోరణి మన వద్ద లేదని, బస్టాండ్‌లో వున్న ప్రయాణికులు ఆటోల్లోనో ప్రయివేటు బస్సుల్లో వెళ్లిపోతున్నారన్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే విధంగా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే డీజిల్ రేట్లు పరిగాయని, రేట్లు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం బస్సు టికెట్ల రేట్లు పెంచలేదని చెప్పారు. సంస్థ ఆస్తులను ఇంఫ్రూవ్‌మెంట్ చేసి ఆదాయం పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం:ఎండీ
బస్సులను శానిటైజ్ చేస్తున్నామని, నిబంధనల ప్రకారం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఆర్టీసీ బస్సులో ప్రయాణమే ఎంతో సురక్షితమని చెప్పారు. ఆటోలు, ప్రయివేట్ వాహనాల్లో ప్రయాణం కంటే ఆర్టీసీ బస్సు ప్రయాణమే సురక్షితమని చెప్పారు. కరోనా తర్వాత 95 శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పునరుద్ధరిస్తామన్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలూ చేపడ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీలు ఏ.పురుషోత్తం, వినోద్‌కుమార్, యాదగిరి, మునిశేఖర్, సీపీఆర్వో కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.