Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక పోరుయాత్రలో టి.రాజారెడ్డి, మందా నర్సింహారావు
- అక్టోబర్ 8న జరిగే సింగరేణి వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-మణుగూరు
ప్రధాని మోడీ పుట్టక ముందు నుంచీ ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలను అమ్మే అధికారం మోడీకి ఎవరిచ్చారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి రాజారెడ్డి, మందా నర్సింహారావు ప్రశ్నించారు. సోమవారం సింగరేణి కార్మిక పోరుయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో పర్యటించింది. ఓసీ2, కెసీహెచ్పీ, ఏరియా వర్క్‌షాప్, దుర్గ ఓబీ కంపెనీ, మున్సిపాలిటీ, ఓసీ4, మణుగూరు ఓసీని సందర్శించి సభలు నిర్వహించారు. మణుగూరు పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ లాభాలు పెంచే 500 బొగ్గు బ్లాక్‌లను అమ్మేందుకు కేంద్రం సిద్ధం చేసిందన్నారు. బొగ్గు పరిశ్రమను ప్రయివేటుపరం చేస్తే విద్యుత్ చార్జీలు పెరుగుతాయని తెలిపారు. సీఎంపీఎఫ్్ రూ.2.5లక్షలు ఉంటే.. వాటిపై వచ్చే వడ్డీని ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి తేవడం దారుణమన్నారు. రిలీఫ్ ఫండ్ పేరుతో కేంద్రం రూ.60వేల కోట్లు, రాష్ట్రం రూ.12వేల కోట్ల నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయాయని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల పేర్లలో ఉన్న తేడాను సరిచేస్తానని చెప్పి.. ఇప్పటివరకు మార్చలేదన్నారు. సింగరేణిలో ప్రతి ఒక్క కార్మికునికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. 250గజాల భూమిని పట్టా చేసి ఇవ్వాలని, అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడాలని యాజమన్యాన్ని డిమాండ్ చేశారు. పోరుయాత్ర అడ్టా మీటింగ్‌లో కాంట్రాక్ట్, అసంఘటిత రంగ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, ఆసంఘటిత రంగ కార్మికులు కలిపి 1.25కోట్ల మంది ఉన్నారనీ, వారికి కనీస వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేతనాల పెరుగుదలకు అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్‌రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పతల నర్సింహారావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్య క్షులు నెల్లూరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వల్లూరి వెంకటరత్నం, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.