Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ సర్కార్
- ప్రశ్నించే వారిపై రాజద్రోహం కేసులా..?
- 27న దేశవ్యాప్త బంద్‌లో సకల జనులు పాల్గొనాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - రామన్నపేట
సంస్కృతి పేరుతో ప్రజలపై మోడీ ప్రభుత్వం దాడులు చేస్తోందని, దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న విధానాలపై సంఘటితంగా పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని అమృతవనంలో సీపీఐ(ఎం) మండల 7వ మహాసభ నాయకులు కూరెళ్ల నరసింహాచారి, జంపాల అండాలు అధ్యక్షతన నిర్వహించారు. సీనియర్ నాయకులు మేక అశోక్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ సర్కార్ కార్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశీయ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తాకట్టుపెట్టి పేదల బతుకులపై భారాలు మోపుతోందన్నారు. కార్మిక చట్టాలను సవరించి పనిగంటలు పెంచి పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసిందన్నారు. విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకూ ధరలను పెంచుతూ సామాన్యుల జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. కష్టాల్లో బీజేపీ యేతర ప్రభుత్వాలను పెగాసస్ స్పైవేర్‌తో కూలదోస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల వారిపై రాజద్రోహం కింద కేసులు పెడుతూ జైళ్లల్లో పెడుతోందన్నారు. బెయిలు ఇవ్వకుండా ఏండ్ల తరబడి జైల్లో ఉండేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దానికి అంటకాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలు ఈనెల 27న తలపెట్టిన బంద్‌లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలం
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీి సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెడుతూ అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడు తోందన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని ప్రచారం చేస్తూ.. వ్యవసాయ మార్కెట్లను ఎత్తేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తోంద న్నారు. కేంద్రం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలకు వంత పాడుతూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతు చట్టాలను మొదట్లో వ్యతిరేకించి ఇప్పుడు మౌనంగా ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, పైళ్ల అశయ్య తదితరులు పాల్గొన్నారు.