Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే హక్కు పత్రాలివ్వాలి...
- అరణ్య భవన్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పోడు సాగుదారులకు వెంటనే హక్కు పత్రాలివ్వాలనీ, వారిపై నిర్బంధాన్ని ఆపాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆ సంఘం ఆధ్వర్యాన హైదరాబాద్లోని అరణ్య భవన్ ముందు నాయకులు, కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగాయి. సంబంధిత అధికారులకు వ్యకాస నేతలు వినతిపత్రాలు సమర్పించారు. అరణ్య భవన్ ముందు జరిగిన ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు మాట్లాడుతూ... వివిధ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ పోడు సాగుదార్లకు పట్టాలిస్తామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. హామీలివ్వటం, వాటిని విస్మరించటం ఆయనకు ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 2006 ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటొద్దని ప్రభుత్వాన్ని కోరారు. పోడు సాగుదారులపై అటవీ అధికారులు తమ దౌర్జన్యాలను ఆపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు వివాదాల్లో ఉన్న భూములపై జాయింట్ సర్వే నిర్వహించి, వాటిని సాగుదారులకు అప్పగించాలని కోరారు. అభివృద్ధి పేరిట షెడ్యూల్ ఏరియాలో ఉన్న భూములను ప్రయివేటు పరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ఏరియాలో ఉన్న భూముల్ని ప్రభుత్వం సేకరించొద్దని సూచించారు. కార్యక్రమంలో వ్యకాస రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ, సిహెచ్ జంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు విజయమ్మ, ఆర్.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.